హనుమకొండ, మే 14 : జిల్లాలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలలో పనిచేస్తున్న హమాలీలకు తాడుకట్టు మామూలు ఒక లారీకి రూ. 2 వేలు ఇవ్వాలని, ప్రభుత్వమే నేరుగా ఒక బస్తాకు రూ.70 కూలీ ఇవ్వాలని ఆల్ హమాలీ వర్కర్స్‌యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. హామాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా చక్రపాణి మాట్లాడుతూ ఐకేపీలో పనిచేస్తున్న హమాలీలకు లారీ యజమానులు ఇచ్చే తాడుకట్టు మామూలు జిల్లా అధికారులు ఇవ్వనీయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కూలీ డబ్బులు రైతుల నుండి వసూలు చేసుకోవాలని చెప్పడంతో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద గొడవలు అవుతున్నాయని, అందుకే రైతుల నుండి కాకుండా ప్రభుత్వమే నేరుగా బస్తాకి రూ.70 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దుమ్ము ధూళిలో పనిచేయడంతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతూ అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రోజుకు నాలుగు పల్లి పట్టీలు, ప్రమాద బీమా ఇన్సూరెన్స్గుర్తింపు కార్డు, సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇవ్వాలన్నారు. ఐకేపీ హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సంగాల మొగిలి, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్, నాయకులు కొంగటి సదానందం, బేరపాక కేశవయ్య, సాంబయ్య, ఎం భాస్కర్, బి నాగరాజ్, ఎం శంకర్, పోషాలు, కే భద్రయ్య, ఎం రమేష్, ఎస్ అశోక్, ఎం రాజయ్య, మామిడి స్వామి, రవి, జగన్, శ్రీనివాస్, కంటాత్మకూర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.