బచ్చన్నపేట నవంబర్ 18 : మాదకద్రవ్యాల నిర్మూలకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నర్మెట సీఐ అబ్బయ్య అన్నారు. మంగళవారం వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనపై ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేజీబీవీ స్కూల్లో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల సొసైటీకి తీరని నష్టం కలుగుతుందన్నారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని వాటి నిర్మూలన కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మండలంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని మారకద్రవ్యాలను సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాలపై ఫిర్యాదుల నమోదు, డి అడిక్షన్ కేంద్రాల సేవల నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్ 14446 ఏర్పాటు చేశామన్నారు. ఈ నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు ఫిర్యాదులు తెలియజేయవచ్చు అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్ఐ హమీద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.