పోచమ్మమైదాన్, మే 17 : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని హాల్లో రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి దవాఖాన పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు.
నగరంలోని ఎంజీఎం, ప్రభుత్వ నేత్ర వైద్యశాల, హనుమకొండ ప్రసూతి దవాఖాన, ప్రభుత్వ టీబీ హాస్పిటల్లో ప్రజలకు అందిస్తున్న విభాగాలు, అందుబాటులో ఉన్న పరికరాలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలో మార్పు చేసే విభాగాలు తదితర అంశాలపై చర్చించారు.
అలాగే కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ దవాఖానతో పాటు ఎంజీఎం దవాఖానను ఉన్నతాధికారులు సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. క్యాథలాబ్, డయాలసిస్ విభాగాలను పరిశీలించారు. ఎంజీఎంలోని క్యాజువాలిటీ, పీడియాట్రిక్ వార్డు, సిటీ స్కాన్, ఎక్స్ రే మిషన్ విభాగాలను సందర్శించారు. కాగా ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘ఇరుకైన క్యాజువాలిటీలో ఇక్కట్లు’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైన రోజే రాష్ట్ర ఉన్నతాధికారులు వచ్చి దవాఖానను నేరుగా పరిశీలించడం గమనార్హం.
కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ నాగేంద్ర, ఈఈ జితేందర్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎస్ఈ దేవేందర్, ప్రభుత్వ దవాఖానల సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, నిర్మల, విజయలక్ష్మి, గిరిధర్‌రెడ్డి, శ్రవణ్, కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, వైస్ ప్రిన్సిపాల్ రాంకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు ఎన్హెచ్ఎం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులకు రెండు నెలల నుంచి రావాల్సిన వేతనాలను చెల్లించే ఏర్పాట్లు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రామ రాజేశ్ చెప్పారు.