పోచమ్మమైదాన్(కాశీబుగ్గ), డిసెంబర్ 23: క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ 18వ డివిజన్లోని సీబీసీ చర్చిలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన కానుకలను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో పేద క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పార్టీలకతీతంగా అన్ని మతాలను గౌరవిస్తూ అందరినీ సమానంగా చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలు పేద ప్రజలకు అనుగుణంగా ఉంటాయన్నారు. ప్రజల బాగు కోసం నిత్యం ఆలోచించే మహానేత కేసీఆర్ అని కొనియాడారు. కులమతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతున్నదని విమ ర్శించారు. వరంగల్ ఎంపీ పసునూటి దయాకర్ మాట్లాడుతూ దేశంలో దళితులపై బీజేపీ అవలంబిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కుల, మతతత్వ పార్టీ నుంచి రక్షించుకునేందుకు పుట్టిందే బీఆర్ఎస్ అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం
వరంగల్‌చౌరస్తా: సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం రాత్రి 36వ డివిజన్ పుప్పాలగుట్టలో బీఆర్ఎస్ నాయకుడు ప్రభుచరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్, క్రిస్మస్కు కానుకలు అందిస్తున్నదని తెలిపారు.
పాఠశాలల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకులు
జిల్లాలోని పలు పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివనగర్ ఏకశిల డీజీ స్కూల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఏసుక్రీస్తు జననంతోపాటు పలు నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆటపాటలతో అలరించారు. వైస్ ప్రిన్సిపాల్ లవకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని శివనగర్ డాన్బోసో నవజీవన్ స్ట్రీట్ చిల్డ్రన్స్ హోమ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబురాలు జరిగాయి. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ అనితారెడ్డి కేక్ కట్ చేశారు. పిల్లల నృత్యాలు ఆకట్టుకున్నాయి. డాన్ బోసో బాధ్యులు సంతోష్, రాజు, దివ్య, శారద పాల్గొన్నారు. అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని కివీ పాఠశాలలో చిన్నారులు దేవకన్యలు, సాంటాక్లాస్ తాతయ్య వేషధారణలో ఆకట్టుకున్నారు. హెచ్ఎం దాసి సతీశ్‌మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అన్నదేవర ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. గీసుగొండ మండలం మరియపురం సెయింట్ జాన్స్ హైస్కూల్, గొర్రెకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఫాదర్ రాజు, మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, గొర్రెకుంట హెచ్ఎం అనిత, టీచర్లు ప్రణతి, రఘువీర్, దమరి, చంద్రశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.