జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): చిన్న కాళేశ్వరం.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా తీసుకొని నిర్మించిన ప్రాజెక్టు. 14 చెరువులు నింపి 45,742 ఎకరాలకు సాగు నీరందించే ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కేసీఆర్ సర్కారు 70శాతం పూర్తి చేసింది. పలు అనుమతుల్లో జాప్యం జరుగడంతో మిగిలిన 30 శాతం పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అనంతరం కాళేశ్వరం పనులు ప్రారంభించి పూర్తి చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు ప్రారంభించి పక్కన పెట్టింది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఫాస్టాగ్ ప్రాజెక్టుగా చేపట్టి పూర్తి చేస్తామని మంత్రులు చెప్పిన మాటలకు ఏడాది గడిచింది. పనుల్లో పురోగతి కనిపించకపోగా కనీసం ప్రాజెక్టుకు ప్రత్యేక ఎస్ఈని సైతం నియమించకపోవడం పాలకుల పనితీరుకు అద్దం పడుతున్నది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.571 కోట్లు ఇచ్చినట్లు పత్రికల్లో రోజుకో విధంగా ప్రచారం చేస్తున్నారు. 70శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుకు రూ.571 కోట్లు ఎక్కడ ఖర్చు చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు.
గతంలోనే 70శాతం పనులు
కాళేశ్వరం సమీపంలో బీరసాగర్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌ను నిర్మించింది. రెండో ఫేజ్ కోసం కాటారంలో మరో పంప్‌హౌస్ నిర్మాణ పనులు పూర్తి చేసింది. మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 45,742 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు బీరసాగర్ (కన్నెపల్లి) నుంచి నాలుగున్నర టీఎంసీలు ఎత్తిపోసేలా పనులు చేపట్టారు. ఇందుకోసం 3,625 ఎకరాల భూమి అవసరం కాగా ఇందులో 637 ఎకరాల అటవీ భూమి ఉంది. ఈక్రమంలో భూసేకరణ పనులు దాదాపు పూర్తి కాగా అటవీ శాఖ అనుమతి సైతం వచ్చింది. మరో 1,025 ఎకరాల భూసేకరణ పూర్తి కావాల్సి ఉందని, పైపులైన్ పనులు మరో 5 కిలోమీటర్లు జరగాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుకున్న విధంగా ప్రాజెక్టు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయితే నాలుగు మండలాల్లో 14 చెరువులు నింపి 45,742 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందేవి. పలు అనుమతులు జప్యం కావడం, ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు బీరసాగర్ పంప్‌హౌస్‌లోకి నీరు రావడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి.
రూ.571 కోట్లు మంజూరయ్యాయా?
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు రూ.571 కోట్లు మంజూరయ్యాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిందా? అధికారులు నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపారా? ఇవి ప్రస్తుతం సమాధానం లేని ప్రశ్నలు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 635 కోట్లు మంజూరు చేయగా వీటితో రెండు పంప్‌హౌస్‌లు, 14 చెరువుల సామర్థ్యం పెంచడం, పైపులైన్ నిర్మాణం కోసం సుమారు రూ. 353 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీరసాగర్ పంప్‌హౌస్ వద్ద నీళ్లు పంప్‌హౌస్‌లోకి వెళ్లకుండా బండ్ నిర్మాణ పనులు, సబ్‌స్టేషన్ పనులు, చెరువుల సామర్థ్యం పెంచే పనులు కొనసాగిస్తున్నది. వీటి కోసం ప్రభుత్వం రూ.571 కోట్లు మంజూరు చేసిందా? ఈ నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? అసలు ఈ నిధులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫాస్టాగ్ ప్రాజెక్టుగా ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించినప్పటికీ ఏడాది గడుస్తున్నా 30శాతం పనులు పూర్తికాకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. బీరసాగర్ పంప్‌హౌస్ నుంచి నీటిని మహదేవపూర్ సమీపంలోని ఎర్రచెరువుకు, అక్కడి నుంచి మందిరం చెరువు, కొత్త చెరువుకు మొదటి విడతలో నీటిని తరలిస్తామని, మార్చి మొదటి వారంలో ట్రయల్ రన్ ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు తెలుపుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం పైసా ఇవ్వలే
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులనే చూపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 70శాతం పనులు పూర్తి చేసింది. దాదాపు పూర్తయిన ప్రాజెక్టుకు రూ.571 కోట్లు ఎందుకు? ప్రాజెక్టును ఫాస్టాగ్ కింద పెట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పైసా పని కాలేదు. కనీసం ప్రాజెక్టుకు ఎస్ఈ కూడా లేడు. ఎకరం భూమి సేకరించలేదు. ఒక్క ట్యాంక్ కాడ పని మొదలు కాలేదు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
– పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే, మంథని