నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 21: మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం మిర్చి సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారడంతోపాటు వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. దీంతో కొందరు రైతులు సాధారణ పద్ధతిలో మిర్చి సాగు చేస్తుండగా.. ఎక్కువ మంది రైతులు మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. చీడపీడల నివారణ, కలుపు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించేందుకు ఎక్కువగా రైతులు మల్చింగ్ పద్ధతిని పాటిస్తున్నారు.
ముఖ్యంగా నర్సంపేట మండలంలోని దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, మాదన్నపేట, నాగుర్లపల్లి, ముత్తోజిపేట, మహేశ్వరం, భోజ్యానాయక్తండా, చక్రంతండా, గురిజాల, చిన్నగురిజాల, గుర్రాలగండిరాజపల్లి గ్రామాల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తూ రైతులు ఉత్సాహంగా మిర్చి పంట సాగు చేస్తున్నారు. కలుపు నివారణ తక్కువగా ఉండడం వల్ల రైతుల దృష్టి మల్చింగ్ సాగుపై పడింది. గతేడాది మిర్చికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడంతో ఈ దఫా రైతులు మిర్చి సాగుపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.