సంగెం, మార్చి 23: నీటితొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బలాంగీర్ రాష్ట్రం బంబులియాబన్కు చెందిన రాజు మహకూర్ కుటుంబం బతుకు దెరువు కోసం మండలంలోని ఆశాలపల్లి గ్రామ శివారులోని ఇటుక బట్టీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 22న సాయంత్రం సమయంలో వారు ఇటుక బట్టీ పనుల్లో ఉండగా రాజుమహకూర్ కూతురు బబితామహకూర్(18 నెలలు) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడింది.
పక్కనే ఉన్న రష్మీత పటేల్ చూసి అరవడంతో వెళ్లి నీటి తొట్టిలో నుంచి పాపను తీసి హుటాహుటిన వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి చిన్నారి మృతి చెందింది. దీంతో బతుకుదెరువు కోసం పరాయి రాష్ర్టానికి వచ్చి తమ బిడ్డను కోల్పోయామని రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రాజుమహకూర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎల్ నరేశ్ తెలిపారు.