హనుమకొండ, ఏప్రిల్ 24 : మడికొండ సత్యసాయి కన్వెన్షన్‌లో మంగళవారం జరిగే బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్స్‌లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్‌తో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలో అగ్రభాగాన నిలిపారన్నారు. 60 లక్షల సభ్యత్వాలతో ఉమ్మడి కుటుంబంగా బలమైన శక్తిగా దిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతున్నామన్నారు. నియోజకవర్గంలో 26 డివిజన్లకు 18 డివిజన్ల సమ్మేళనాలు పూర్తయయ్యాని తెలిపారు. మంగళవారం జరిగే ప్రతినిధుల సభకు 3,500 మంది హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించడంతోపాటు పలు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం, బీఆర్ఎస్పై బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు అన్ని అబద్ధమేనన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి అవగాహన లేకుండా బీజేపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వరంగల్ ప్రజల చిరకాల వాంఛ కోచ్ ఫ్యాక్టరీ అయితే పీవోహెచ్ షెడ్ పరిశ్రమ ఇచ్చిన బీజేపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. షెడ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి అప్పగించినా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అబద్ధాలు వల్లించే అమిత్‌షా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఆయన మాటలు విజ్ఞులైన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. దేశాన్ని తెలంగాణ మోడల్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ అంటే బీజేపీ నేతల్లో వణుకు పుడుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో దేశంలోని అరాచక శక్తులకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్గా మార్చారన్నారు. బీజేపీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, మోదీ, అమిత్‌షా పతనం ఖాయం అని చీఫ్ విప్ అన్నారు. దళితులను ధనవంతులు చేయాలనే లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకం ప్రారంభించారన్నారు. కిసాన్ నినాదంతో కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు. విభజన హామీలైన కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ సాధించే వరకు మరో ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దగాపడిన రైతులు, కార్మికులు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ కేంద్రంగా పాలన సాగుతుందని చీఫ్ విప్ అన్నారు.
మోదీ, అమిత్‌షా టూరిస్టుల్లా వస్తున్నారు..
ప్రధాని మోదీ, అమిత్‌షా తెలంగాణకు టూరిస్టుల్లా వస్తున్నారు తప్ప రాష్ర్టానికి చేసింది ఏమీలేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరమే అభివృద్ధి జరిగిందన్నారు. కొత్తగా ఏర్పాటైన ఇతర రాష్ర్టాల్లో ఇంత అభివృద్ధి ఎక్కడా జరుగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలన్నీ ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. టీఎస్ ఐపాస్‌ను భారత పారిశ్రామిక రంగాల్లో ఉపయోగిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విదంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఎల్ఐసీ లాంటి లాభాలు ఆర్జించే సంస్థలను అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయీ తీసుకురాలేదన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేని బీజేపీ నాయకులకు తెలంగాణ గురించి అడిగే అర్హత లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాటా ను ఇప్పించాలని డిమాండ్ చేశారు. విధానాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధిపై కాకుండా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌షా అనడం రాజకీయ అవకాశ వాదమేనని బండా ప్రకాశ్ అన్నారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్‌సింగ్, కార్పొరేటర్లు ఏనుగుల మానస, నెక్కొండ కవిత, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాంప్రసాద్, నెక్కొండ కిషన్ పాల్గొన్నారు.