పరకాల, జూలై 2 : గురుకుల విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. బుధవా రం పరకాల పట్టణంలోని శ్రీవాణి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటం వద్ద నివాళలర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీవాణిది ప్రభుత్వ హత్యేనని, కాంగ్రెస్ సర్కారు బాధ్యత వహించాలన్నారు.
బీఆర్స్ పాలనలో పర్వతాలు అధిరోహించిన గురుకులాల విద్యార్థులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను సీఎం రేవంత్ రెడ్డి బ్రష్టుపట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. శ్రీవాణి ఘటనపై కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడానని, గురుకులాలను సందర్శించి మిగతా పిల్లలకు మనోధైర్యం కల్పించాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని కోరానని చల్లా తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రేవూరి జయపాల్‌రెడ్డి, బండి సారంగపాణి, గంట కళావతి, శనిగరపు నవీన్, దుంపేటి నాగరాజు, బండి రమేశ్ ఉన్నారు.