శాయంపేట, జూన్ 21 : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో చలివాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు మూలకుపడ్డాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి రైతులకు కాల్వల ద్వారా నీరివ్వాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ సర్కారు రూ.10. 50 కోట్లతో పనులు చేపట్టగా, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 శాతం కూడా జరగలేదు. ఏడాదిన్నరగా నత్తనడకన సాగిన పనులు ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడంతో రైతుల నో ట్లో మట్టికొట్టినట్లయ్యింది. 60 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాతో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాలకు కల్పతరువుగా మారింది. వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న ది. మరోవైపు పరకాల నియోజకవర్గంతో పాటు శాయంపేట మండలంలోని సుమారు 120 గ్రామాలకు మిష న్ భగీరథ నీరందిస్తున్నది. భీంఘన్‌పూర్ నుంచి గోదావరి జలాలను నింపుతూ ధర్మసాగర్ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. పలు జిల్లాలకు తాగు నీటికి వినియోగిస్తున్నారు. అలాగే వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కుకు కూడా ఇక్కడి నుంచే నీరు సరఫరా చేస్తున్నారు.
ఇంతటి బహుళ ప్రయోజనకరమైన ప్రాజెక్టు అభివృద్ధికి కేసీఆర్ సంకల్పించగా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కాల్వల సిమెంట్ లైనింగ్, కట్ట బలోపేతం, కొత్త తూము, ఆరు చోట్ల కొత్త బ్రిడ్జిలు, కాల్వ మధ్యలో షట్టర్లు నిర్మించాల్సి ఉన్నది. అయితే ప్రధాన తూము నుంచి కొంత దూరం గైడ్వాల్స్తో సిమెంట్ లైనింగ్ నిర్మించి ఆపేశారు. ఇంకా కొన్ని కిలోమీటర్లు పనులు జరగాల్సి ఉంది. కొత్త తూము నిర్మించాల్సి ఉన్నా, పాత దానికే సిమెంట్ పూత పూశారు. తూముకు కొత్త షట్లర్లు అమర్చలేదు. చలివాగు కట్టను వెడల్పుతోపాటు బలోపేతం చేయాల్సి ఉన్నా, ప్రాజెక్టు ప్రాంతంలోని మట్టినే పోయడంతో పగుళ్లు ఏర్పడి, చెట్లు పెరిగి ప్రమాదకరంగా మారుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించినా అధికారులు చూసిచూడటన్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అభివృద్ధి పనుల కోసం రెండుసార్లు యాసంగిలో చలివాగు తైబందీని నిలిపివేశారు. గత యాసంగిలోనూ నిలిపివేసే పరిస్థితులున్నా రైతుల ఒత్తిడితో ఇచ్చారు. చలివాగుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్, అధికారుల తీరుపై ఉన్నతాధికారులు స్పందించి, త్వరగా పనులు పూర్తి చేయించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ శాఖ డీఈ గిరిధర్‌ను వివరణ కోరగా కాంట్రాక్టర్ అభివృద్ధి పనులను నిలిపివేశారని, బిల్లులు అందక ఇటు వైపే రావడం లేదని, తాము చేసేదేమీ లేదని చెప్పారు.