మనోళ్లిద్దరిని కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించగా వీటిలో రెండు పదవులు వరంగల్ జిల్లాకు దక్కాయి.. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరిదీ వరంగల్ జిల్లానే కావడం.. ఉన్నత పదవులు దక్కడంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– వరంగల్, మార్చి 23 (నమస్తేతెలంగాణ)
వరంగల్, మార్చి 23 (నమస్తేతెలంగాణ): తాజాగా వరంగల్ జిల్లాకు రెండు కార్పొరేషన్ పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా వీరిలో ఇద్దరు వరంగల్ జిల్లావాసులు కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలికవసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ సంస్థ చైర్మన్‌గా మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్‌ను నియమిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో రావుల శ్రీధర్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్ వరంగల్ జిల్లా వాసులు. రాయపర్తి మండలం ఊకల్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. టీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మెట్టు శ్రీనివాస్‌ది వరంగల్‌లోని శివనగర్. ఈయన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో సీపీఎం సహకారంతో రాష్ట్రంలో ఉన్న మేధావులు, బీసీ ఉద్యమకారులతో ఏర్పడిన బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017 మార్చి 20న మెట్టు శ్రీనివాస్ రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. వివిధ జిల్లాల్లో శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2021లో వరంగల్ రూరల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు, కమిటీల ఇన్చార్జిగా పనిచేశారు. కీలక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన రావుల శ్రీధర్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లావాసులు ఇద్దరికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు రావడంపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పేరు : రావుల శ్రీధర్‌రెడ్డి
గ్రామం : ఊకల్, మండలం : రాయపర్తి
జిల్లా : వరంగల్, విద్య : ఎంబీఏ
తల్లిదండ్రులు: రావుల సరస్వతీదేవి, పురుషోత్తంరెడ్డి
భార్య: రావుల రాధికారెడ్డి(అడ్వకేట్)
సంతానం: కుమారుడు, కుమార్తె
విద్యాభ్యాసం: ఖమ్మం జిల్లా కొర్లగూడెంలో 10వ తరగతి వరకు, వరంగల్ ఎల్బీ కళాశాల, హైదరాబాద్‌లోని ఎల్బీ కళాశాలలో ఉన్నత విద్య
రాజకీయ అరంగ్రేటానికి ముందు అంబుజ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం
పేరు: మెట్టు శ్రీనివాస్
నివాసం: శివనగర్, ఖిలావరంగల్
జిల్లా: వరంగల్, కులం: మున్నూరుకాపు
వయసు : 51 సంవత్సరాలు
విద్యార్హత: ఎంఏ ఎకనామిక్స్, మహబూబాబాద్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మూడేళ్లు లెక్చరర్‌గా విధులు.
ప్రస్తుత బాధ్యత: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి
రాజకీయ నేపథ్యం: 1991 కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం..
1997 నుంచి 2015 వరకు సీపీఎం వరంగల్ నగర కార్యదర్శిగా 18 ఏండ్లు పనిచేసిన అనుభవం. ఆరేండ్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు. 1999, 2009, 2014లో సీపీఎం అభ్యర్థిగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ..