Kannada TV Actress | బెంగళూరులో ఓ ప్రముఖ కన్నడ బుల్లితెర నటిపై జరిగిన వికృత చేష్టలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. 32 ఏళ్ల వయసున్న ఈ టీవీ నటి, తాను ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్లిన సమయంలో మహిళా టాయిలెట్లో రహస్యంగా వీడియోలు తీశారని, ఆపై ఆ వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఫిబ్రవరి 6 నుంచి 13వ తేదీ మధ్య కాలంలో బెంగళూరులోని ఒక ఇండోర్ స్టేడియంలో ఈ ఘోరం జరిగినట్లు ఎఫ్ఐఆర్ (FIR)లో నమోదైంది. తాను వాష్‌రూమ్ ఉపయోగిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రహస్యంగా అసభ్యకర వీడియోలు చిత్రీకరించి, ఆపై వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.
అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడు తొలుత ఈ వీడియోలను నటి స్నేహితురాలి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు పంపి, అది నటి ఖాతానే అని భావించి బెదిరింపులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాకుండా మరిన్ని వ్యక్తిగత వీడియోలు తన వద్ద ఉన్నాయని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తానని సదరు బ్లాక్‌మెయిలర్ హెచ్చరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354సితో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు షూటింగ్ లొకేషన్లలో పనిచేసే ప్రొడక్షన్ బాయ్స్ లేదా ఇతర సిబ్బంది పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతా ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.