మూడు రోజులు కుంభవృష్టి వానలతో ఇండ్లు, పంటలు, వాహనాలు అన్నీ కోల్పోయి జనజీవనం అస్తవ్యస్తమై సాయం కోసం ఎదురుచూస్తున్న వేళ.. వరద నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం పొద్దుపోయాక మానుకోటకు చేరుకుంది. మూడు గంటల ఆలస్యంగా రాత్రి 7 గంటలకు ఖమ్మం నుంచి వచ్చి రాత్రివేళ ఉరుకులు.. పరుగులతో హడావిడి చేసింది. పల్లెల్లో అంతా నిద్రపోయే సమయానికి టార్చ్‌లైట్, వాహనాలు, సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో డోర్నకల్, మరిపెడ మండలా ల్లోని వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు కొట్టుకుపోయిన వంతెనలను అతి కష్టం మీద చూశారు.
సమయం లేకపోవడం, నేరుగా క్షేత్రస్థాయిలో పంటలను చూసే పరిస్థితి లేక వరదకు కొట్టుకుపోయిన పంటలను ఫొటో ఎగ్జిబిషన్, వీడియో రూ పంలో వీక్షించారు. పలువురి ఇంటికి వెళ్లి వరద ఎంత వచ్చింది.. నీటి ప్రవాహ ఉధృతిపై ఆరా తీసి ఏయే వస్తువులు పో యాయని అడిగి తెలుసుకున్నారు. అ లాగే రైతులను పలకరించగా పొలా ల్లో ఇసుక మేటలు, రాళ్లు కొట్టుకొచ్చి ఎకరానికి లక్ష దాకా నష్టం వచ్చిందని మీరే ఆదుకోవాలని సారు అంటూ వేడుకున్నారు. ఇలా చివరగా ముల్కలపల్లి లో రాత్రి 9.30గంటలకు పర్యటన ముగించుకొని మళ్లీ ఖమ్మం బయల్దేరారు.
– మహబూబాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/మరిపెడ/ కురవి/డోర్నకల్
మహబూబాబాద్ జిల్లాలో వరద నష్ట వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బుధవారం రాత్రి కేంద్ర బృందం సభ్యులు కల్నల్ కేపీ సింగ్, మహేశ్‌కుమార్, శాంతినాథ్ శివప్ప కాగి, ఎస్కే కుష్వాహ, టీ నియలకన్సన్, డాక్టర్ శశివర్దన్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, సెక్రెటరీ మైన్స్ అండ్ జియాలజీ సురేంద్రమోహన్ మరిపెడ మండలంలోని ఉల్లెపల్లి, సీతారాంతండా, గాలివారి గూడెం, పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జిలను పరిశీలించారు.
ముందుగా మరిపెడ రోడ్లు, భవనాల అతిథిగృహంలో మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ కేంద్ర బృందం సభ్యులకు స్వాగతం పలికారు. అక్కడినుంచి గాలివారిగూడెం మీదుగా ఉల్లెపల్లికి చేరుకున్నారు. గ్రామంలో నీట మునిగిన పంట చేన్లు, గ్రామంలోకి చేరిన నీటి ప్రవాహంపై ఫొటో ప్రదర్శనను వారు వీక్షించారు. అర్ధరాత్రి వరద రావడంతో భయపడ్డామని.. ప్రాణాలతో బయటపడ్డాం కానీ.. సర్వం కోల్పోయిన తమను అన్ని విధాలా ఆదుకోవాలని స్థానిక మహిళ బొట్టు కోటమ్మ కోరింది. అనంతరం వల్లోజు భిక్షం ఇంటిని పరిశీలించి వరద ప్రవాహంపై ఆరా తీశారు.
సీతారాంతండాలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఫొటో ప్రదర్శనతో పాటు ల్యాప్‌టాప్‌లో వరద ఉధృతిని కేంద్ర బృందానికి వివరించారు. తండాలో ఇస్లావత్ మంగీలాల్ గృహాన్ని పరిశీలించారు. వరద ఉధృతి ఎంతవరకు వచ్చిందని ఆ రోజు ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడేనా.. గతంలో ఎప్పుడైనా వరద వచ్చిందా.. అంటూ గృహ యజమాని మంగీలాల్, కవిత దంపతులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సీతారాంతండాకు నాలుగు సార్లు వరద వచ్చింది కానీ ఇంత తీవ్రత ఎప్పుడూ లేదని మంగీలాల్ బదులిచ్చారు.
ఇంట్లోని వస్తువులతో పాటు నిత్యావసరాలు, తినుబండారాలు, పత్రాలన్నీ వరద పాలయ్యాయన్నారు. ప్రాణాలు అరచేతులో పెట్టుకుని డాబాల మీదకు పరుగులు తీశామని చెప్పుకున్నారు. ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుందని, తండాను వేరే ప్రాంతానికి తరలిస్తే మంచిదన్నారు. ఆ తర్వాత కేంద్ర బృందానికి తండా మహిళలు పలు విషయాలను దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా తండాను మరోచోటికి మార్చాలని, ఈ ముంపు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భయంభయంగా బతుకుతున్నామని, మరో సురక్షిత ప్రాంతంలో తండాను నిర్మిస్తే బాగుంటుందని మహిళలు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్అండ్బీ ఎస్ఈ నాగేంద్రరావు, తొర్రూరు ఆర్డిఓ నరసింహారావు, మరిపెడ తహసిల్దార్ డి.
సైదులు, ఇరిగేషన్, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి విజయనిర్మల, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. డోర్నకల్ మండలంలోని ముల్కలపల్లి ఎస్సీకాలనీకి కేంద్ర బృందం వెళ్లి వరద బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో సోమమ్మ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అలాగే వరద ధాటికి కొట్టుకుపోయిన ఆకేరు వాగు బ్రిడ్జిని పరిశీలించారు. అధికారులతో, రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎన్.అశోక్ అనే రైతు కేంద్ర బృందం సభ్యులతో మాట్లాడారు. ఒక్కో ఎకరానికి లక్ష రూపాయలు నష్టం జరిగిందని, పంట పొలాలలో ఇసుక మేటలు, రాళ్లు వచ్చి భూములు వ్యవసాయానికి పనికిరాకుండా ఉన్నాయన్నారు. ప్రభుత్వమే పంట పొలాలలో రేగడి మట్టి తొలగించి వ్యవసాయానికి ఉపయోగపడేలా చేయాలని కోరారు.
ఊహించిన వరదల నుంచి మానుకోట జిల్లా ప్రజలు ఇంకా తేరుకొనే లేదు. వరదల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చినా తక్షణ సాయమేదీ అందక ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కేంద్ర బృందం పర్యటించింది. సాయంత్రం నాలుగు గంటలకు రావాల్సిన అధికారులు రాత్రి 7గంటలకు వచ్చారు. అకడినుంచి మొదలైన హడావిడి ఉరుకులు, పరుగులతోనే సరిపోయింది. రెండు బృందాలుగా విడిపోయిన సభ్యులు ఒక బృందం రోడ్లు, బ్రిడ్జిలకు జరిగిన నష్టాన్ని చూస్తూ వెళ్లారు. మరొక బృందం గ్రామాలు, తండాల్లో పర్యటిస్తూ ఫొటో ఎగ్జిబిషన్లను తిలకిస్తూ ఒకరిద్దరితో మాట్లాడుతూ ముందుకు సాగారు. బృందాల వెంట వాహనాల హడావుడి ఎకువైంది.
త్వరగా వెళ్లాలనే ఆత్రుతో.. లేక సరైన టూర్ షెడ్యూల్ లేకనో ప్రజలు చెప్పేది అరకొరగా విని గాలికి వదిలేశారు. ప్రజలు తమ బాధలు చెప్పుకుంటుంటే వింటూ ఓకే కేంద్రానికి నివేదిస్తాం అంటూ వెళ్లిపోయారు. కేంద్ర బృందాల అలా వచ్చి ఇలా వెళ్లడం చూసి ప్రజలు ఇంత మాత్రానికి అసలు ఎందుకొచ్చినట్లు అంటూ విసుకున్నారు. గ్రామాల్లో, తండాల్లో ప్రజలు నిద్రపోయే వేళలు వచ్చి టార్చ్లైట్లు, కారు లైట్ల వేసుకొని వచ్చి నష్టాన్ని పరిశీలించడంతో తమ గోస పట్టదా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో రోజు పగటిపూట వస్తే తమ బాధలు వారికి కనబడేదని గ్రామస్తులు బృందాలు వెళ్లిన వెంటనే గుసగుసలాడుకోవడం వినిపించింది.