న్యూశాయంపేట : మహిళా రిజర్వేషన్లపై ( Women Reservations ) పై కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్దిలేదని, బీజెపి మోసాన్ని మహిళా లోకం గమనించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ( AIDWA President) ఎం.రమాదేవి ( Ramadevi ) కోరారు. 2023 రిజర్వేషన్ బిల్లును యధావిధిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆదివారం న్యూశాయంపేట సూర్జిత్నగర్లోని ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు రేణుకుంట్ల మయూరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళా బిల్లు ఒకటి మాత్రమే ప్రవేశపెడితే తక్షణమే ఆమోదిస్తామని అన్ని రాజకీయపార్టీలు, ప్రతిపక్ష సభ్యులు కోరాయని తెలిపారు.
తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా డీలిమిటేషన్ బిల్లును కూడా దీనితో అమలుకు పార్లమెంట్లో 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. 543 స్థానాల నుంచి ఏకంగా 850 స్థానాలకు పెంచుతామని బిల్లులో సూచించి అందులో ఏ రాష్ట్రానికి ఎంత శాతం పెంచుతారో బిల్లులో పొందు పరచక పోవడం శోచనీయమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్ల కేటాయింపు జరగడంతో దక్షణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరగనుందన్నారు.
అనంతరం 31వ డివిజన్ ఐద్వా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా కురుకు రజిత, ప్రధాన కార్యదర్శి రేణుకుంట్ల మయూరి, ఉపాధ్యక్షురాలు బానోతు మమత, రాజమ్మ, సహాయ కార్యదర్శులుగా భాగ్యలక్ష్మి, శిరీషాతో 15 మందికి కమిటీలో చోటు కల్పించారు. ఈ సమావేశంలో ఐద్వా కాజీపేట మండల కార్యదర్శి దాసరి అనిత, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సాంబయ్య, కారు ఉపేందర్ పాల్గొన్నారు.