నెక్కొండ, సెప్టెంబర్ 1 : తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిలిపివేతకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని రెడ్లవాడ, సాయిరెడ్డిపల్లె, అప్పల్రావుపేట, వెంకటాపురం, తోపనపల్లి, నక్కలగుట్ట తండా, పెద్దకోర్పోలు, గుండ్రపల్లి గ్రామాల లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే కేంద్రం ఈ పథకం అమలుపై సవాలక్ష కొర్రీలు పెట్టిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత కరంట్ పథకాన్ని ఎత్తివేయాలని, మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందన్నారు.
దేశంలో కేసీఆర్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి తెలంగాణలో అలమవుతున్న సంక్షేమ పథకాలు రద్దు చేయాలంటూ బీజేపీ నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేయించారన్నారు. ఎన్నికల కోసం కాషాయ నేతలు తెలంగాణకు వస్తున్నారని, విదేశీ పక్షులను తలపించే విధంగా వీరి పర్యటనలు ఉన్నాయన్నారు. ఎన్నికలు అయిపోగానే ముఖం చాటేస్తారన్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం తెలంగాణకు ఆదేశాలు జారీచేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్‌నాయక్, జడ్పీటీసీ లావుడ్యా సరోజన, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్‌లు రావుల శ్రీలత, మేనేసి సుబ్బారావు, వడ్డె రజిత, కుమార్, ఫకీర్మియా, మహబూబ్‌పాషా, భోంపెల్లి రాజేశ్వర్‌రావు, రెడ్లవాడ ఉప సర్పంచ్ వీరభద్రయ్య, నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, తాటిపల్లి శివకుమార్, గుండవరపు రవీందర్రావు, సూరం రాజిరెడ్డి, పొడిశెట్టి సత్యం, దొనికెన సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.