రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా పేరుగాంచిన వరంగల్‌లో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. నగరంలో ట్రాఫిక్‌తో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. రైల్వే కనెక్టివిటీ, జాతీయ రహదారులు అనుసంధానంగా ఉండడంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చోరీలకు అడ్డాగా ఎంచుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు, దాడులు, హత్యలు, చోరీ ఘటనల్లో సీసీ ఫుటేజ్లే కీలకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులు కేసులను త్వరగా ఛేదించలేకపోతున్నారు.
– సుబేదారి, ఏప్రిల్ 20
నగరంలో ట్రాఫిక్ సమస్యలను చక్కదిద్దడానికి 50 జంక్షన్లు, 40 ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ప్రధాన జంక్షన్లతో పాటు మరికొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్ల వద్ద స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కేబుల్ వైర్ ద్వారా పీసీ, కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్మార్ట్ పథకం కింద రూ. 80 కోట్ల తో ఏడాది క్రితం నగర జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన 615 సీసీ కెమెరాలను ఎయిర్ ఫైబర్ ద్వారా మున్సిపల్ ప్రధాన కార్యాలయం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు.
ఐట్రిబుల్ సెంటర్ నుంచి 30 టెక్నీషియన్స్ జంక్షన్ల సీసీ కెమెరాలు ఫుటేజీలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటారు. మొదట్లో బాగా పనిచేసినప్పటికీ జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాల్లో సీసీ కెమెరాల పోల్స్ దెబ్బతినడం, వైరింగ్ డిస్కనెక్ట్, తదితర లోపాలతో క్యాప్చర్ కనిపించడం లేదని టెక్నీషియన్స్ చెబుతున్నారు. సర్వర్ డౌన్ సమస్య వచ్చి నపుడు సీసీ ఫుటేజీలు రికార్డు కావడం లేదు. వెంటనే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇక స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కేబుల్ వైర్ ద్వారా జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా సరిగా పనిచేయ డం లేదు. కేబుల్ వైర్ తెగినపుడు, పోల్స్ దెబ్బతిన్నపుడు పోలీసులు స్పందించడం లేదు. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారులు, దాతల నుంచి డబ్బులు వసూలు చేసి హైరేంజ్ కాకుండా, నాసిరకం కెమెరాలు అమర్చడంతో కనీసం 10 మీటర్ల దూరం కూడా క్యాప్చర్ కనబడడం లేదని, తొందరగా దెబ్బతింటున్నాయని టెక్నీషియన్స్ చెబుతున్నారు.
ఆధునిక పోలీసింగ్ వ్యవస్థలో ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమంటారు. రోడ్డు ప్రమాదాలు, దాడులు, హత్యలు, చోరీ కేసుల దర్యాప్తులో ఇవి కీలకంగా మారాయి. ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ పాయింట్ల వద్ద మున్సిపల్ కెమెరాలు మాత్ర మే కొంత వరకు పనిచే స్తున్నాయి. ఇక పోలీసులు అర్చిన కెమెరాలు నాసిరకం, మెయింటనెన్స్ లేకపోవడంలో పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో పోలీసులు త్వరగా కేసులను ఛేదించలేక పోతున్నారు.
రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు సీసీ పుటేజీ క్యాప్చర్ కనబడకపోవడంతో ఢీకొట్టిన వాహనాలను గుర్తించలేక పోతున్నారు. లా అండ్ ఆర్డర్లో పనిచేసే కొందరు పోలీసు అధికారులు తమ పరిధిలో సీసీ కెమెరాల మెయింటనెన్స్, ఏర్పాటుపై సరిగా దృష్టి పెట్టక కేసులను క్రైం విభాగం పోలీసులకు అప్పగించి తప్పించుకుంటున్నారు. ఇటీవల చెడ్డీ గ్యాంగ్ విద్యారణ్యపురి కాలనీలో చోరీ చేశారు. ఇంటి ఓనర్ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలతో ఈ ముఠా వెలుగులోకి వచ్చింది.
నగర జంక్షన్లలోని సీసీ కెమెరా పుటేజీలను జల్లెడ పట్టినా ఈ మూఠా ట్రేసవుట్ కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి హైరేంజ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఖమ్మం,కరీంనగర్, హైదరాబాద్, నర్సంపేట, ములుగు రహదారుల్లో సిటీ లిమిట్లో కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.