పౌర సేవల్లో ప్రజల మెప్పు పొందుతూ కొందరు ‘బెస్ట్ పోలీస్’ అవార్డులు అందుకుంటుంటే.. మరికొందరేమో తమ వ్యవహార శైలితో పోలీస్ శాఖకే తలవంపులు తెస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అధికార పార్టీ నేతల మెప్పు కోసం కొందరు ఖాకీలు, మంత్రి అనుచరుడితో అంటకాగుతూ సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో మంత్రి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని అబాసుపాలైనా.. మేమింతే..
మారమంతే అన్నట్టు ఇటీవలి బల్దియా కౌన్సిల్ మీటింగ్ వద్ద అనుచరుడికి ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు సలాం కొట్టిన తీరు విమర్శలకు తావిస్తున్నది. అంతటితో ఆగకుండా భూదందాలు, సెటిల్మెంట్లు, చివరకు చిన్న చిన్న గొడవల్లోనూ తలదూర్చి అతడి ఆజ్ఞానుసారం అమాయక ప్రజలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రతాపం చూపించడమే గాక బాధితులపైనే తప్పులు కేసులు పెడుతున్నారు. ఇలా అధికార పార్టీ అండతో అధికారులకు, పోలీసులకు హుకుం జారీ చేస్తూ నిత్యం అతడు చేస్తున్న ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
– సుబేదారి, సెప్టెంబర్ 26
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోలీసు అధికారుల తీరు విస్తుగొల్పుతోంది. సామాన్యులపై జులుం ప్రదర్శిస్తూ.. రౌడీషీటర్లకు సలాం కొడుతుండడం, మంత్రికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కీలకంగా ఉంటున్న సదరు వ్యక్తికి రాచమర్యాదలు చేయడం చర్చనీయాంశమవుతున్నది. మంత్రి అనుచరుడు చెప్పినట్లుగానే అన్ని స్టేషన్లలోని పోలీసు అధికారులు పనులు చేసి పెడుతుండగా సొంత పనులకు, సామాన్యులను బెదిరించేందుకు ఈ అనుచరుడు పోలీసులను రోజూ పురమాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భూ దందాలు, కుటుంబ పంచాయితీల సెటిల్మెంట్లు, చివరికి కోర్టు పరిధిలోని లిటిగేషన్లలోనూ అతడు చెప్పినట్లే చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
మంత్రి కంటే ఎక్కువగా అనుచరుడి ఇంటి దగ్గర రోజంతా దర్బార్ నడుస్తున్నది. ఇటీవల మంత్రి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి అనుచరుడు వరంగల్ ఏసీపీ, ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్లతో కలిసి నడిరోడ్డుపై ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పటాకులు పేలి ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. అనంతరం మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ మల్లయ్యపై పోలీస్ కమిషనర్ బదిలీ వేటు వేశారు.
ఈ పరిణామాల తర్వాత సైతం పోలీసు అధికారులలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ వద్ద మంత్రి అనుచరుడి హడావుడి, ఆయనకు పోలీసుల అతి మర్యాదలు పోలీస్ శాఖను అప్రతిష్టపాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎలాంటి పదవి లేని ఓ మాజీ రౌడీషీటర్ గ్రేటర్ కౌన్సిల్ మీటింగ్‌కు రాగానే ఓ ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎదురు వెళ్లి సెల్యూట్‌తో స్వాగతం పలికిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసు ఉన్నతాధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మంత్రి అనుచరుడు వరంగల్ నగరంలోని అతని నివాసం వద్ద సెటిల్మెంట్ల కోసం కోటరీతో దర్బార్ నిర్వహిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తానే అంతా అని అధికార పార్టీ క్యాడర్‌కు, అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులు పొద్దునే మంత్రి అనుచరుడిని కలిసి సెల్యూట్ చేసిన తర్వాతే డ్యూటీకి వెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మంత్రి అనుచరుడి సెటిల్మెంట్స్ దందాలతో సామాన్యులు భయాందోళకు గురవుతున్నారు. అధికార పార్టీ, పోలీసుల అండతో మంత్రి అనుచరుడు చేసే అరాచకాలకు అడ్డు లేకుండా పోతున్నదనే చర్చ జరుగుతున్నది.