ఉత్కర్ష-2024లో భాగంగా కేఎంసీలో మంగళవారం నాలుగో రోజూ కార్నివాల్ నైట్ సంబురంగా సాగింది. ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో రక్తదాన శిబిరంతో మొదలై సాయంత్రం ఎన్ఆర్ఐ భవన్లో ఫుడ్ ఫెస్టివల్, మ్యూజికల్ బ్యాండ్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా వైద్య విద్యార్థుల ఆటాపాటలు, కేరింతలతో కళాశాల ప్రాంగణమంతా హోరెత్తింది.
కేఎంసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాంకుమార్‌రెడ్డి, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆశాదేవి ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి సామాజిక స్పృహ కలిగించేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. శిబిరంలో 60 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. అనంతరం ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా స్టాల్స్‌లో రుచికరమైన వంటకాలు చేసి విద్యార్థులకు వడ్డించారు. అలాగే విద్యుత్ వెలుగుల్లో విద్యార్థులు అర్ధరాత్రి వరకు ఆటపాటలతో అదరగొట్టారు. బుధవారం సంప్రదాయ దినోత్సవం, దాండియా నైట్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.
– వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 24