రెండో శనివారం, ఆదివారం సెలవులను స్వగ్రామంలో సంతోషంగా గడుపుదామని భర్త, భార్య ఇద్దరు పిల్లలు ఆనందంగా కారులో బయలు దేరారు.. ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు.. వరంగల్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వారిలో ముగ్గురు మృత్యు కౌగిలికి చేరుకున్నారు. వేగంగా వస్తున్న కారు మార్గమధ్యంలో అదుపు తప్పి ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లడంతో భర్త, ఇద్దరు పిల్లలు జల సమాధి కాగా, భార్య ఒక్కతే ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో శనివారం చోటు చేసుకోగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో విషాదం నింపింది.
ఇలాంటి ఘటనే నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో చోటు చేసుకుంది. కారు కెనాల్లో పడగా ప్రధానోపాధ్యాయురాలుతో సహా ముగ్గురు మృతిచెందగా, మరొకరు ఈదుకుంటూ బయటకు వచ్చారు. – పర్వతగిరి/నెల్లికుదురు, మార్చి కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లగా తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడిన ఘటన పర్వతగిరి మండలం కొంకపాక శివారులో శనివారం జరిగింది. పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్ఐ బోగం ప్రవీణ్, స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మేచరాజుపల్లికి చెందిన సోమారాపు సారంగపాణి-పద్మ దంపతుల చిన్న కుమారుడు సోమారపు ప్రవీణ్‌కుమార్ (30) వరంగల్‌లోని ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో భార్య కృష్ణవేణి, సాయి చైత్ర (5), హర్షవర్ధన్ (2)తో కలిసి సొంతూరుకు కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో కారు మార్గమధ్యంలోని కొంకపాక శివారులోకి రాగానే ప్రవీణ్‌కుమార్ ఛాతిలో నొప్పి వస్తున్నదంటూ ఆసుపత్రి వెళ్లడానికి కారును యూటర్న్ చేసి తిరిగి వరంగల్ వైపు వస్తున్నాడు. కొద్ది దూరం రాగానే కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే ప్రవీణ్ భార్య కృష్ణ్ణవేణి కారు డోరు తెరిచి కు మారుడు హర్షవర్ధన్‌ను బయటకు విసిరి తాను కూడా దూకింది. కారుతో పాటు ప్రవీణ్‌కుమార్, చైత్ర కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న స్థానికులు కృష్ణవేణిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోతున్న హర్షవర్థన్‌ను అక్కడున్న వారు నీటిలో నుంచి బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గల్లంతైన కారుతో పాటు ప్రవీణ్, చైత్రను వెతికేందుకు సుమారు మూడు గంటలసేపు శ్రమించారు.
గజ ఈతగాళ్లు, ప్ర త్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు కారుతో పాటు అందులోనే మృతి చెందిన ప్రవీణ్‌కుమార్, సాయి చైత్రను వెలికి తీశారు. ఈ వార్త తెలుసుకున్న ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులు సారంగపాణి, పద్మతో పాటు గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బోరున విలపించా రు. ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో మేచరాజుపల్లికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో ఆ గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయమే గ్రా మానికి చెందిన ఇద్దరు చేపల వేటకు వెళ్లి మృతి చెందా రు. కాగా, ఘటనాస్థలానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు చేరుకొని మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మామునూరు ఏసీపీ తిరుపతి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
సంగెం, మార్చి 8 : సంగెం మండలంలోని తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కెనాల్ రోడ్డు మృత్యు మార్గంగా మారింది. వరంగల్ నుంచి పర్వతగిరి వెళ్లేందుకు ప్రధానరోడ్డు, కెనాల్ నుంచి షాపురం వెళ్లేందుకు మరో దారి, గుడితండాకు వెళ్లేందుకు ఇంకోదారి.. ఇలా నాలుగు వైపులా అక్కడి నుంచే వెళ్లాలి. తీగరాజుపల్లి నుంచి పర్వతగిరి వెళ్లే దారిలోనే ఎస్సారెస్పీ కాలువ వద్ద మూలమలుపు ఉంది. ఇక్కడే వాహనాలు కంట్రోల్ కాక ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు.
నాలుగేళ్ల కిత్రం ఫిబ్రవరి 10, 2021న వరంగల్ నుంచి వస్తున్న కారు ఇదే కెనాల్లో పడిపోయింది. అప్పుడు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుతో సహా ముగ్గురు మృతి చెందగా, ఒకరు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే ప్రాంతంలో అలాంటి ఘటనే పునరావృతమైంది. ఈ ఘటనలో కూడా ముగ్గురు మృత్యువాత పడగా, ఒకరు క్షేమంగా బయటకు వచ్చారు. అయితే కెనాల్ వద్ద ఏదో ఒక శక్తి ఉందని, అందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తీగరాజుపల్లి గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కెనాల వద్ద రెండు వైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రేడియం స్టిక్కర్లు అతికించాలని పలువురు సూచిస్తున్నారు.