హనుమకొండ, జూన్ 2 : నాడు, నేడు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే శాపమని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి, పదేళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట జాతిపిత మహాత్మాగాంధీ ఫొటోకు పూలమాల వేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిషరించి జాతీయ గీతం ఆలపించారు. అలాగే పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి, తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ ఫొటోలకు పూలమాలలేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ జెండాను దాస్యం వినయ్ భాసర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల పోరాటం, అమరవీరుల బలిదానాలు, బీఆర్ఎస్ పోరాటం వల్లే తెలంగాణ సాకారమైందన్నారు. నాడు, నేడు కాంగ్రెస్ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రం 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఆగమైందన్నారు. దాస్యం వినయ్‌భాసర్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి పునరంకితమవుదామన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ నాటి స్మృతులను ఉద్యమకారులందరూ మరోసారి నెమరు వేసుకుంటున్నారని అన్నారు. 14 ఏళ్ల క్రితం కేసీఆర్ ఒకడిగా మొదలై కోట్లాది మంది ప్రజలను పోగుచేసి స్వరాష్ట్ర కలను సాకారం చేశారన్నారు. కేసీఆర్ పాలనలో విద్య, వైద్య విప్లవంతో పాటు దండుగన్న వ్యవసాయం పండుగలా మారిందన్నారు.
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని, మళ్లీ కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ఆగమవుతున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 18 నెలలుగా అమలు చేసిన పాపాన పోలేదని, మళ్లీ తెలంగాణలో ఆత్మహత్యల ఆకలి కేకలు మొదలయ్యాయని వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు చెన్నం మధు, సోదా కిరణ్, ఇమ్మడి లోహిత, స్వరూపారాణి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, నాయకులు జానకి రాములు, పోలపల్లి రామ్మూర్తి, దూలం వెంకన్న, రఘు తదితరులు పాల్గొన్నారు.
కాగా, మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత జాతీయ జెండా ఆవిష్కరించగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొన్నారు. అలాగే వరంగల్, డోర్నకల్‌లో మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, డీఎస్ రెడ్యానాయక్, జనగామ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొని జెండాలు ఆవిష్కరించారు.