కాంగ్రెస్‌లో పోటాపోటీ యాత్రలు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ‘హస్త’వ్యస్తంగా ఉన్న ఆ పార్టీని గ్రూపుల లొల్లి పట్టిపీడిస్తుంటే.. పార్టీ పెద్దలు చేస్తున్న యాత్రలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పోటీగా అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర సోమవారం నుంచి హనుమకొండ జిల్లాలో కొనసాగనుండగా, స్థానిక హస్తం నేతల్లో నిరాసక్తత కనిపిస్తున్నది. ఒక్క పార్టీ నుంచే ఒకరి తర్వాత మరొకరు యాత్రలు చేయడం ఏమిటని కార్యకర్తల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో పట్టు‘భట్టి’ చేస్తున్న పాదయాత్రకు నాయకులు, కార్యకర్తలు తరలివస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
వరంగల్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్‌లో అయోమయం కొనసాగుతున్నది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి. నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లోనే కాకుండా.. రాష్ట్ర స్థాయిలోనూ పోటాపోటీ కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పోటీగా అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో అయోమయాన్ని పెంచుతున్నది. ఒక పార్టీ తరఫున ఒకరి వెంట ఒకరు పాదయాత్రలు చేయడం ఏమిటని అనుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో పోటీతో వారి పాదయాత్రలు ఎలా ఉన్నా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు.
కాంగ్రెస్ పార్టీని సాధారణ జనం ఎప్పుడో మరిచిపోయిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ఇదేతీరుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర స్ఫూర్తితో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఇప్పటికే పాదయాత్ర నిర్వహించారు. రేవంత్‌రెడ్డికి పోటీగా ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇదే పనిలో నిమగ్నమయ్యారు. భట్టివిక్రమార్క పాదయాత్ర సోమవారం నుంచి ఈనెల 27 వరకు హనుమకొండ జిల్లాలో జరుగనున్నది. అనంతరం జనగామ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ మేరకు భట్టివిక్రమార్కు బృందం పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ ఈ యాత్రను పట్టించుకోవడం లేదు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో చేసిన పాదయాత్ర జనం లేక తూతుమంత్రంగా సాగింది. ఇప్పడు భట్టి పాదయాత్ర ఇదే తీరుగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. పాదయాత్ర షెడ్యూల్ ఇచ్చినే వారు కనీసం ఆ ప్రాంతంలోని నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎక్కడా పెద్దగా బలం లేదు. అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే. ఈ కారణాలతో సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు స్పందన వచ్చే పరిస్థితి లేదని హస్తం పార్టీ జిల్లా నాయకులు చెబుతున్నారు.
ఎన్నికల తరుణంలో ఒక రాజకీయ పార్టీ ముఖ్యనేత పాదయాత్ర అంటే చాలా హడావుడి ఉంటుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకత్వం అంతా యాత్రలో నిమగ్నమై పని చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శ్రేణులు, నాయకులు లేని పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ నేతల ఆధిపత్య పోరుతో ఆ పార్టీలోని కొద్ది మంది శ్రేణులు స్తబ్దుగా ఉండిపోతున్నాయి. భట్టి విక్రమార్క పాదయాత్ర సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ఉనికి దాదాపు లేదు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దారుణంగా పడిపోయింది. భట్టి పాదయాత్రకు వచ్చే వారు లేని పరిస్థితి ఇక్కడ ఉన్నది. కమలాపూర్ మీదుగా వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు సైతం ఈ సెగ్మెంట్లలో ఎవరూ లేరు. వర్ధన్నపేటలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వయంగా అక్కడి స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌లో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి పంచాయితీపై పీసీసీ నాయకత్వం ఏమీ తేల్చడం లేదు. దీంతో నాయకుల్లోనూ అదే అయోమయం కొనసాగుతున్నది. స్టేషన్ ఘన్పూర్ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఉన్నది. పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.
ఇలా భట్టి పాదయాత్ర జరిగే సెగ్మెంట్లలో ఈ కార్యక్రమం సమన్వయం చేసే వారు లేని పరిస్థితి ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే. ఈ నేపథ్యంలో భట్టి పాదయాత్ర విజయవంతంపై హస్తం పార్టీ నేతల్లోనే ఆందోళన నెలకొన్నది. భట్టి విక్రమార్క పాదయాత్ర ఏర్పాట్ల కోసం డీసీసీ ఆఫీసులో నిర్వహించిన సమావేశానికి ఏ నాయకుడూ రాలేదు. ఇప్పడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యక్రమాలకు, ఆ పార్టీ నేతల యాత్రలకు కార్యకర్తలు సైతం వచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు సమావేశంలో వాపోయినట్లు తెలిసింది.