ఖిలావరంగల్: మానవ హక్కుల నేత డాక్టర్ బుర్ర రాములు 14వ యాది సభను బుధవారం ఖిలావరంగల్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి బాదావత్ రాజు మాట్లాడారు.
బుర్ర రాములు విద్యార్థి దశ నుండే సామాజిక అవగాహనతో ప్రగతిశీల ఉద్యమాలను నిర్మించారని అన్నారు. వివిధ వర్గాల ప్రజల హక్కులను ప్రభుత్వాలు, పెత్తందారులు, భూస్వాములు హరించే సమయంలో అండగా ఉండి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 1980 నుండి రెండు దశాబ్దాల చీకటి కాలంలో నాటి ప్రభుత్వాలు పౌర ప్రజాస్వామ్య హక్కులను కాల రాస్తుంటే అమరులు డాక్టర్ బాలగోపాల్, నర్రా ప్రభాకర్ రెడ్డి లతో కలిసి పీడిత ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు.
నేడు దేశ ప్రజలు హిందూ ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని అంటూదళిత మైనారిటీ జాతుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలలో డాక్టర్ బుర్ర రాములును స్ఫూర్తిగా తీసుకొని పనిచేయడమే ఆయనకు మనం అందించగల నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, నాయకులు పాలకుర్తి సత్యనారాయణ, సాదు రాజేష్, శ్రీనివాస్, యాదగిరి, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్, అడ్వకేట్ తీగల జీవన్, మైదం సంజీవ, ఐలయ్య, మైదం పాని, హరిబాబు లతోపాటు ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.