వర్ధన్నపేట, అక్టోబర్ 28 : ఆన్లైన్లో గేమ్స్ ఆడి అప్పుల పాలై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకోగా వరంగల్ జిల్లా కడారిగూడెంలో విషాదాన్ని నింపింది. తెలిసిన వివరాలిలా ఉన్నాయి. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్ (20) హైదరాబాద్‌లోని ఘట్కేసర్ వద్ద ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
గీత కార్మికుడైన గణేశ్ తండ్రి దేవేందర్ పదేళ్ల క్రితం తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. దీంతో గణేశ్ తల్లి సంధ్య ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ కుమారుడితో పాటుగా కూతురును వరంగల్‌లోని ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివిస్తున్నది. కాగా, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతూ ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన గణేశ్ తన స్నేహితుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు.
అంతేకాక ఇటీవల దసరా పండుగకు కడారిగూడెం వచ్చిన గణేశ్ కళాశాలలో ఫీజు కట్టేందుకు తల్లి నుంచి రూ.80 వేలు తీసుకెళ్లి వాటిని కూడా ఆన్లైన్ గేమ్‌లో పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గణేశ్ సోమవారం కళాశాల సమీపంలో క్రిమిసంహారక మందు సేవించినట్లు తల్లి సంధ్యకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఘట్కేసర్ పోలీసుల సహకారంతో సోమవారం రాత్రి మృతదేహాన్ని కడారిగూడేనికి తీసుకువచ్చారు. కాగా, భర్త లేకపోయినా పిల్లల్ని కష్టపడి చదవిస్తుండగా, చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి సంధ్య బోరున విలపిస్తున్నది.