జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ బృందం ఈ నెల 18న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను సందర్శించనుందని భూ పాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తెలిపారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకుంటున్నారని, అయినా రేవంత్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రెండున్నరేళ్లుగా మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతు చేయించకుండా కేవలం విచారణలు, పరీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.
ఇప్పటికే సీఎంతో పాటు మంత్రుల బృందం పలుమార్లు మేడిగడ్డను సందర్శించినా ఎలాంటి ప్రయోజనం లేదని, మళ్లీ ఈ నెల 20న మళ్లీ పర్యటించి రైతులను మోసం చేయాలని చూస్తున్నాడని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఆటలు సాగనివ్వమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి మేడిగడ్డకు చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న కుట్రపూరిత వైఖరిని ప్రజలు, రైతుల ముందుంచుతామన్నారు. రేవంత్ ప్రభుత్వ చెవులు పిండి బరాజ్‌కు మరమ్మతు చేయిస్తామని, ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకువచ్చే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.