శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని.. అందుకే రైతు కుటుంబం నుంచి వచ్చిన గోల్డ్‌మెడలిస్ట్ కావాలో, 56 కేసులున్న బ్లాక్‌మెయిలర్ కావాలో పట్టభద్రులు నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కోరారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ బుధవారం నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ సన్నాహక సమావేశాల్లో ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
రాజకీయాల్లోకి కొత్తవాళ్లకు ముఖ్యంగా యువకులకు, విద్యావేత్తలకు అవకాశం ఇవ్వాలని అంటారని, ఇప్పుడు అలాంటి వ్యక్తి రాకేశ్‌రెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. కాకతీయల కాలం నుంచి నేటి వరకు చదువులకు పుట్టినిళ్లు వరంగల్ అని, అలాంటి వరంగల్ గడ్డలో పట్టభద్రులు ఓటు వేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలు చూడాలని.. చట్టసభలు, పెద్దల సభలు చెడ్డ సభలు కావద్దంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ప్రస్తుతం అధికార స్వరాలు కాదని, ధిక్కార స్వరం కావాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అసలు పేరు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ అని, అలియాస్ అనే పదం దొంగలకు, నేరస్తులకు ఉపయోగిస్తారన్నారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్లో వరంగల్ పశ్చిమ, ఉర్సు నానీగార్డెన్లో వరంగల్ తూర్పు, నర్సంపేటలోని పద్మశాలి ఫంక్షన్హాల్లో నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలు నిర్వహించగా కేటీఆర్ హాజరై మాట్లాడారు.
ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌తో పాటు అందరు నాయకులు వరంగల్‌కు వచ్చి ప్రచారం చేశారని, మోసపోతే గోసపడుతామని, చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరినట్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం అరచేతిలో వైకుంఠం చూపెట్టారని విమర్శించారు. ప్రపంచంలోనే సీఎం రేవంత్‌రెడ్డిలాంటి మెజీషియన్ లేరన్న కేటీఆర్ ఐదు నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వార ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి తాము 30వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గుమాలిన, నీతిమాలిన సీఎం ప్రపంచంలో ఎక్కడా లేడన్నారు.
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాలు 30వేల మందికి ఎలా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ కాలంలోనే 30మందికి ఉద్యోగాలు అన్ని పరీక్షలు నిర్వహించామని, చిన్నచిన్న లీగల్ సమస్యల వల్ల ఆగాయని అన్నారు. వాటిని కూడా తామే ఇచ్చామని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సరికాదన్నారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆసుపత్రిలో ఐదు గంటలు కరెంటు లేకపోవడంతో పాటు ఉన్న నాలుగు జనరేటర్లలో ఒక్కటి కూడా పనిచేయడం లేదన్నారు.
దీంతో ఇంకుబేటర్స్లోని నవజాత శిశువులు, వెంటిలేటర్స్‌పై ఉండే వారితో పాటు రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి, తెలివిలేని దద్దమ్మ రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే శాసనమండలిలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల తరఫున ప్రశ్నించేతత్వం ఉన్న రైతుబిడ్డ, విద్యావంతుడు, గోల్డ్మెడలిస్ల్ ఏనుగుల రాకేష్‌రెడ్డిని పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రీయ గీతంగా గుర్తించిన జయ జయహే తెలంగాణలో కాకతీయులు, రామప్ప లాంటి ప్రాంతాల చరిత్ర ఉంటే తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయుల తోరణం తొలగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నాడంటే అది ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనమన్నారు. బ్లాక్ మెయిలర్, బూతులు తిట్టే తీన్మార్ మల్లన్న లాంటి వారిని పెద్దల సభకు పంపితే బూతు సభగా మారే అవకాశం ఉంటుందన్నారు. బిట్స్ పిలానీలో చదివిన విద్యావంతుడు ఒక వైపు..
పల్లి బఠానీలు అమ్మే వ్యక్తి మరోవైపు ఉన్నారని, ఇందులో ఎవరు కావాలో మీరే నిర్ణయించాలని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారని గోల్డ్‌మెడలిస్టు అని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో తీన్మార్ మల్లన్న బ్లాక్‌మెయిలర్ అని అతడిపై 56 చీటింగ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఆయన ఇచ్చిన అఫ్డవిట్లోనే రాసుకున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసిన ఇలాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ పోటీకి దింపిందని తెలిపారు. ఓరుగల్లు బిడ్డలు పౌరుషానికి ప్రతీకలని, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నేల అని గుర్తుచేశారు. ఈసందర్భంగా రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్షీనారాయణ చేసిన ట్విట్టర్ మేసేజ్‌ను సమావేశంలో వినిపించారు. అనంతరం బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు.
ఆయాచోట్ల సమావేశాల్లో జగిత్యాల, కోరుట్ల, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు సంజయ్, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బాల సుమన్, వొడితల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీ అభ్యర్థులు సుధీర్‌కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, రవీందర్‌సింగ్, రామకృష్ణారావు, వెంకటేశ్వర్లు, నాయకులు జనార్దన్ గౌడ్, పులి రజిని కాంత్, జోరిక రమేశ్, వీరేందర్, సమ్మారావు, డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్ మసూద్, ఎన్నికల పరిశీలకులు కిమ్స్ కళాశాల అధిపతి రవీందర్రావు, సతీశ్‌రెడ్డి, గుగులోత్ రామస్వామినాయక్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నామాల సత్యనారాయణ, బండి రమేశ్, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, గోనె యువరాజు పాల్గొన్నారు.
కరెంటు కోతలతో ఉక్కిరిబిక్కిరి
కరెంటు కోతలతో రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన ఎంజీఎం దవాఖానలో ఐదు గంటల పాటు కరెంటు నిలిచిపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు అన్నారని, మార్పు అంటే ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇండ్లలో కరెంటు పోతే సర్దుకుపోవచ్చు కాని ఎంజీఎం దవాఖానలో కరెంటు పోతే వెంటిలేటర్లపై ఉన్న పేషెంట్లు, ఇంక్యుబేటర్లపై ఉన్న నవజాత శిశువులు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక సారి ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఎట్లా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉందో ప్రజలకు అర్థమవుతుందన్నారు.
ఓటుతో దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి
ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అహంకారానికి.. ఆశయానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఆశయం ఉన్న వ్యక్తి విద్యావంతుడు రాకేశ్‌రెడ్డి. గ్రాడ్యుయేట్స్ దీన్ని మేథోమథనంగా భావించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 54 మహిళా డిగ్రీ కళాశాలలు మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం వల్ల తద్వారా నిరుపేద విద్యార్థి మానస పైలట్ అయ్యింది. అలాగే గురుకుల పాఠశాలలు ప్రారంభించిన ఘనత కేసీఆర్‌కు దక్కింది. సీఎం రేవంత్‌రెడ్డి ఏ మాత్రం విలువలు లేని తీన్మార్ మల్లన్నను తీసుకొచ్చి ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు.
కరోనా వైరస్ లాంటి వ్యక్తి మల్లన్న ప్రయివేట్ వ్యక్తులు, ఎమ్మెల్యేల ఫోన్ టాపింగ్, పోలీస్ కానిస్టేబుళ్లతో కొట్లాట, ఫొటోల మార్ఫింగ్ లాంటి వాటికి సంబంధించి 56 కేసులు ఉన్నాయి. 70రోజులు జైలుకు వెళ్లాడు. ఇలాంటి వ్యక్తి పట్టభద్రులకు ఎలా ప్రతినిధి అవుతారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేరని, మాకే 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మేమే గెలుస్తామనే అహంకారంతో కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్ ఈ నెల 27న జరుగునుంది. విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు హక్కుతో దుర్మార్గులను ఓడించి, నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రశ్నించేతత్వం ఉన్న విద్యావంతుడు రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి.
– నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
పెద్దల సభకు మేధావులను పంపాలి
మండలి అనేది పెద్దల సభ.. అలాంటి సభకు మేధావులను పంపాలి కానీ బ్రోకర్, బ్లాక్ మెయిలర్, అబద్ధాలు ఆడే వారిని కాదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక సమాజానికి స్ఫూర్తి కావాలి. పార్టీ ఏదైనా పట్టభద్రులు ప్రతిభకు పట్టం కడుతారు. ఓరుగల్లు విద్యాకేంద్రం, మేధావులకు నిలయం. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ లాంటి హామీలిచ్చి అధికారంలోకి వచ్చి వాటి ఊసెత్తడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సీఎం రేవంత్‌రెడ్డిని సమస్యలపై నిలదీయలేడు.
జీవో నంబర్ 46ను రద్దు చేస్తానన్న సీఎం రద్దు చేయలేదు. పోరాటం చేయాలన్నా, నిలదీయాలన్నా, ప్రశ్నించే గొంతుక కావాలన్నా అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న తీన్మార్ మల్లన్నకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. నగరంలో 60వేల వరకు గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నారు. పార్టీలకతీతంగా నాకు ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరుతున్నా. గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఫండ్‌తోపాటు గౌరవ భృతి కూడా నిరుద్యోగుల కోసం ఖర్చు చేస్తా.
ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలి
ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం కావాలి. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. 420 హామీలు 6 గ్యారెంటీలంటూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. గులాబీ సైనికులంతా విద్యావంతుడు రాకేశ్‌రెడ్డిని గెలిపించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో గులాబీ జెండాయే ఎగిరిందని ఈసారి కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు.
కలిసికట్టుగా, సంపూర్ణ సహకారంతో రాకేశ్‌రెడ్డి గెలుపునకు కృషిచేద్దామని కోరారు. ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారన్నారు. పట్టభద్రులు ఒక సవాలుగా తీసుకొని రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రోజుకు 24 సార్లు కరెంటు పోతున్నదని కాంగ్రెస్ పార్టీ ఎన్ని మోసపూరిత కుట్రలు చేసి అధికారంలోకి వచ్చిందో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. రాకేశ్‌రెడ్డికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామన్నారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో నర్సంపేట ఎంతో అభివృద్ధి చేశానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటకు మెడికల్ కళాశాలను మంజూరు చేయించానని అన్నారు. అన్ని రంగాల్లో నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపించానని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. నిత్యం బూతులు మాట్లాడే తీన్మార్ మల్లన్నకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటేయాలని కోరారు.