నెల్లికుదురు, ఆగస్టు 20 : యూరియా కోసం ఇప్పటిదాకా లైన్లో నిలబడుతూ సహనంతో ఉన్న రైతన్న సమరశంఖం పూరించారు. నిద్రాహారాలు మాని, జోరు వానను భరించి ఓపికతో ఉన్న రైతులు సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. బాంచెన్.. కాల్మొక్తా అంటూ బతిమిలాడిన రైతులు ‘ఇగ బరిగీసి నిలబడుడే.. యూరియాను సాధించుడే’ అన్న రీతిలో బుధవారం ఆందోళనకు దిగారు. యూరియా బస్తాల కోసం నెల్లికుదురు సొసైటీ ఎదుట అన్నదాతలు క్యూలో పడిగాపులు కాశారు. రాత్రి 12 గంటల నుంచే లైన్లో చెప్పులు పెట్టారు. వర్షంలో సైతం తడుచుకుంటూ నిలబడ్డారు. రైతులకు మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత నెల్లికుదురు సొసైటీ ఎదుట తొర్రూరు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై 1000 మందికి పైగా రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రైతులను రోడ్డెక్కించిన సీఎం రేవంత్ దిగి పోవా ల్సిందేనని, చాతగాని ప్రభుత్వమని, ముందుచూపు అవగాహన లేని సర్కారంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూరియా బస్తాలు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో మండల ప్రత్యేకాధికారి, ఏవో, తహసీల్దార్, స్థానిక ఎస్సై రైతులతో మాట్లాడారు. జిల్లా అధ్యక్షురాలు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, మాజీ అధ్యక్షుడు ఆకుల జగ్గయ్య, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు బత్తిని అనిల్, యూత్ అధ్యక్షుడు హెచ్ అశ్వీన్, నాయకులు వీరగాని మల్లేశ్, ప్రశాంత్, బిక్కు పాల్గొన్నారు.
రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బుధవారం నర్సింహులపే మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. పీఏసీఎస్ గోదాం వద్దకు యూరియా రావడంతో పోలీసుల ఆధ్వర్యంలో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పు న అందించారు. ఐదెకరాలున్న రైతులకు ఒక్క యూరియా బస్తా ఇస్తే ఎలా అని రైతులు ఆవేవన వ్యక్తం చేశారు.
రైతుకు కనీసం యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. తక్షణమే దిగిపోవాలి. పంట సీజన్ మొదలైనప్పటి నుంచి రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నా ప్రభుత్వానికి సోయి లేదు. రైతులు ఒక్క యూరియా బస్తా కోసం రాత్రి 12 గంటల నుంచి దోమలు కుడుతుంటే, వర్షంకురుస్తుంటే క్యూలో చెప్పులు పెట్టి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పాలక ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. ముందుచూపులేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవా ల్సిందే. గత 10 ఏళ్లలో ఏనాడు రైతన్న తన సమస్య కోసం రోడ్డెక్కలేదు. యూరియా బస్తాను పుట్టిన రోజుకు గిప్టుగా ఇచ్చే స్థాయికి పరిస్థితి దిగజారింది. రైతులు ఉసురుతీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న తగిన గుణపాఠం చెబుతాడు.
– మాలోత్ కవిత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్