హనుమకొండ, జూన్ 18 : 30 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి రూపొందించిన ‘రాకేశ్‌రెడ్డి ఈ – క్లాస్ యాప్’ను గురువారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ప్రొఫెసర్ తిరుణహరి శేషు, న్యూరో వైద్యడు నవీన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుకుమార్‌తో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో కలిపి 1.67లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఇవ్వడంతోపాటు పరోక్షంగా ప్రైవేటు రంగంలో దేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఉన్న ప్రైవేటు కంపెనీలు తరలివెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. రెండేళ్లకోసారి పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీగా ఉండేదని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు కావొస్తున్నా ఒక్క పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. విద్యారంగాన్ని సైతం నిర్వీర్యం చేసే కుట్ర రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏ ఒక యూనివర్సిటీలో కూడా అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అని నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఆశలు కల్పించి మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో మాట్లాడిన కోదండారాం, తీన్మార్ మల్లన్న, ఆకునూరి మురళి, రియాజ్‌లో ఇపుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. మన ఉద్యోగాలు మనకు వచ్చే వరకు పోరాటం ఆపొద్దని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధాని మోదీ సైతం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని మోసం చేశారని అన్నారు. గత పదేళ్ల పాలనలో నీళ్లు, నిధులను సంపూర్ణంగా ఒక రేవు చేసుకున్నామని, అలాగే నియామకాలు చేసినప్పటికీ చెప్పుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. ఈ సారి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని భరోసా ఇచ్చారు. ఉన్నత విద్యావంతుడు, నిరుద్యోగ యువత సమస్యలు, నిత్యం వారు పడే కష్టాలు చూసే వ్యక్తి, మీ అందరి కోసం ‘రాకేశ్‌రెడ్డి ఈ- క్లాసెస్’ యాప్‌ను రూపొందించి ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు చేసిన మోసంపై యువతరమంతా ఏకమై పిడికిలెత్తి తిరగబడదామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా గతంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల పట్టాలను అభ్యర్థులకు ఇస్తూ, వేదికలపై కేసీఆర్‌ను, గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టడం లేదన్నారు. పోరాటాల పురిటి గడ్డ వరంగల్ గడ్డ అని, అబద్ధాల పునాదిపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతరం ఏకమై పిడికిలి బిగించి తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మూడేళ్లు కావొస్తున్నా కాంగ్రెస్ సరార్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ఇప్పుడు నిరుద్యోగ యువత మళ్లీ కేసీఆర్‌ని గుర్తు చేసుకుంటున్నారన్నారు. రాకేష్‌రెడ్డి లాంటి యువ నాయకుడు ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడం హర్షణీయమన్నారు. నేటి తరం ఓ పక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే మీ కోసం మేము చేసే పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ సర్కారు మూడేళ్ల తర్వాత 5 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని, అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి హెచ్చరించారు. కేవలం నిరుద్యోగ యువత పక్షాన ప్రశ్నించడమే కాకుండా వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండాలనే సంకల్పంతో ‘రాకేశ్‌రెడ్డి ఈ – క్లాసెస్’ యాప్‌ను రూపొందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని యువత నమ్మి కోచింగ్ సెంటర్లకు వెళ్లారని, కానీ, మూడేళ్లుగా ఒక నోటిఫికేషన్ రాకపోవడంతో కోచింగ్ సెంటర్లు, హాస్టల్ ఫీజులు, రూమ్‌రెంట్లు కట్టలేక ఆర్థికంగా చితికిపోయారని అన్నారు. ఇక నోటిఫికేషన్లు రావని ఆశ కోల్పోయి, దిల్సుఖ్ నగర్, అశోక్‌నగర్‌ను వదిలి గ్రామాల్లోకి తరలి వెళ్తున్న యువత కోసమే ఈ ఉచిత యాప్‌ను రూపొందించామన్నారు. అందరూ ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్‌లో మీకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాకేశ్‌రెడ్డి గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ మొకవోని సంకల్పంతో విద్యార్థి, నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు.