ములుగు : బీఆర్ఎస్( BRS) ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఈ నెల 27న ఉమ్మడి వరంగల్( Warangal ) జిల్లా ఎలుకతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy ) బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
శుక్రవారం ములుగు జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) నాయకత్వంలో జరుగుతున్న మహాసభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా నుంచి రజతోత్సవ మహాసభకు 15వేల మంది తరలిరావాలని నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చడంలో , ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు,రైతులు కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని వెల్లడించారు.
ములుగు జిల్లాలో పోలీస్ రాజ్యం నడిపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడుతు వేధిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని, రాష్ట్ర పార్టీ నాయకత్వం, జిల్లా నాయకత్వం అండగా ఉంటుందన్నారు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేద వ్యవసాయ కూలీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు.
హైదరాబాదులో భూములు అమ్ముతూ హైడ్రా పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తు, కమిషన్ పాలనను కొనసాగిస్తున్న రేవంత్ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నాయకులు , కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.