ఎల్కతుర్తి, ఏప్రిల్ 27 : ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రోడ్లకిరువైపులా కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలను నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో ఎక్కడ చూసినా ప్రధాన వీధులన్నీ గులాబీ శోభను సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ మన ఇంటి పండగ అని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తరలిరావాలని నేతలు పిలుపునివ్వడంతో అదే తరహాలో ప్రజలు సైతం లక్షలాదిగా తరలివచ్చారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారుల ఆటాపాట ఆకట్టుకున్నాయి. వారితో కలిసి ప్రజలు సైతం ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ కనిపించారు.
సాయంత్రం 5.30 గంటల వరకే సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయినప్పటికీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది కేసీఆర్ ప్రసంగిస్తుండగా నడుచుకుంటూ వస్తూ కనిపించారు. కేసీఆర్ ఏం చెప్తారోనని, ఆయన ప్రసంగం వినేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కేసీఆర్ సభా వేదికపైకి చేరుకోగానే పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసిన అనంతరం ప్రజలకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆవిర్భావ ఆవశ్యకత, ఉద్యమ సమయంలో ఎదురైన ఒడిదొడుకులను కేసీఆర్ వివరించడంతో ప్రజలు ఆసక్తిగా విన్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ చేసిన మోసాలను వివరిస్తుండగా కార్యకర్తలు చప్పట్లు, ఈలలతో సందడి చేస్తూ జై కేసీఆర్ అని నినాదించారు. ఆ తర్వాత భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పటాకులు కాల్చారు. సభ అనుకున్న స్థాయికి మించి విజయవంతం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సభ ముగిసిన అనంతరం కేసీఆర్ చింతలపల్లి, ధర్మసాగర్ మీదుగా ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు.
కేసీఆర్‌ను దగ్గర నుంచి చూసేందుకు వచ్చిన. ఆయన మాటలు వినకుండా కాంగ్రెస్‌కు ఓటేసి ఆగమైనం. ఇప్పుడు ఎట్లా అని తండ్లాతున్నం. మళ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే. కాంగ్రెసోళ్ల ఆగడాలు భరించాల్సిందే తప్ప చేసేదేమీ లేదు. కేసీఆర్ పథకాలను పేర్లు మార్చి అమలు చేయకుం డా పైసలు లేవని చెప్పి మొత్తం బంద్ చేసిండ్రు. పేదలు, రైతుల ఉసురు కాంగ్రెస్ సర్కార్‌కు, సీఎం రేవంత్‌కు తగులుద్ది. – గణపతి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా