కాశీబుగ్గ, జూలై 7: వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాలను ప్రభుత్వపరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీకేఎం కళాశాల విషయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కళాశాల పూర్వ విద్యార్థి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పూర్తి సహాయ సహకారాలు అందించారన్నారు.
ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాడు చందా కాంతయ్య మనుమడు విజయ్‌కుమార్, ఈరుసాని తొతంరెడ్డి కళాశాలకు బీజం వేస్తే.. వారి కుమారుడైన రాంరెడ్డితోపాటు టీఎస్మూర్తి, భూపతి కృష్ణమూర్తి కళాశాలను కాపాడుకుంటూ వచ్చారన్నారు. ఈ కశాశాలలో అప్పటి ప్రిన్సిపాల్ ఆచార్య జయశంకర్, వరవరరావు వంటి ఎంతో మంది ప్రముఖులు విద్యనభ్యసించినట్లు గుర్తుచేశారు. ఇలాంటి మహానుభావులు చదువుకున్న కళాశాలకు సాయం అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే పూర్వ విద్యార్థులు, పూర్వ ప్రొఫెసర్లు, సహకరించిన ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సీకేఎం కళాశాల తరఫున కృతజ్ఞతా సభను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఈ కళాశాల పక్కనే ఉన్న నెహ్రూ మెమోరియల్ పాఠశాలను కూడా బోయినపల్లి వినోద్‌కుమార్ మిత్రుల సహకారంతో ప్రభుత్వపరం చేయబోతున్నామని, ఇది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. గతంలో కూడా శంభునిపేటలో కేజీ టు పీజీ అందిస్తున్నట్లు గుర్తుచేశారు. వరంగల్‌లో 24 అంతస్తుల సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే నగరం హెల్త్ సిటీగా మారుతుందన్నారు. నియోజకవర్గంలో కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేయడం శుభపరిణామంగా భావిస్తున్నట్లు తెలిపారు. తూర్పును అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పా రు. అనంతరం ఎమ్మెల్యేను కళాశాల యాజమాన్యం సన్మానించింది. సమావేశంలో కళాశాల కమిటీ గౌరవ సలహాదారుడు ఉపేందర్శాస్త్రి, ప్రిన్సిపాల్ శశిధర్రావు, చందా శ్రీకాంత్, ఈరుసాని రాంరెడ్డి, గాండ్ల శ్రీను, కార్పొరేటర్లు పాల్గొన్నారు.