పరకాల/తొర్రూరు/కృష్ణకాలనీ/భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 9 : మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా మూడు చోట్ల హాజరైన బీఆర్ఎస్ బహిరంగసభలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. భూపాలపల్లి, పరకాల, పాలకుర్తికి సంబంధించి తొర్రూరులో నిర్వహించిన ‘ప్రగతి’ సభలకు ప్రజలు పోటెత్తారు. మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ చప్పట్లతో జేజేలు పలికారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పాలకేంద్రం సమీపంలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ సంక్షేమ సభకు కార్యకర్తలు పోటెత్తారు. అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. డప్పుచప్పుళ్లతో ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువ మంది తరలివచ్చినా ఎక్కడా ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రామన్న తన ప్రసంగంతో గులాబీ సైనికులు, ప్రజల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న, సింగర్ మధుప్రియ, కళాకారులు ఆటపాటలతో సభికులకు ఆకట్టుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రగతి శంఖారావ సభకు వేలాది వచ్చారు.
జిల్లా నలుమూల నుంచి జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో అంబేద్కర్ సెంటర్ కిక్కిరిసిపోయింది. 8 కిలోమీటర్ల పొడవునా గులాబీ రంగుతో భారీ కటౌట్లు, కేటీఆర్ స్వాగత ఫ్లెక్సీలు ఓవైపు, గులాబీ జెండాలతో తరలివచ్చే కార్యకర్తలతో భూపాలపల్లి పట్టణమంతా గులాబీ వర్ణం పులుకుమున్నట్లయింది. మహిళలు కోలాటం, డప్పు వాయిద్యాలతో ర్యాలీగా చేరుకోగా, వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు తమ కులవృత్తులతో పరికరాలతో తరలివచ్చి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అలాగే పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన పేరిట జరిగిన సభకు బీఆర్ఎస్ శ్రేణులు, జనం పోటెత్తారు. దీంతో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. సభ సక్సెస్‌తో పరకాలలో ధర్మారెడ్డి గెలుపు ఖాయమైందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే ఎన్నికల కోడ్ వెలువడడం.. అదే సమయంలో అక్కడి నాయకులు అందించిన శంఖంతో మంత్రి కేటీఆర్ ‘ఎన్నికల శంఖారావం’ పూరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలువడమే గాక బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూ.59.45 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షినితో కలిసి మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ చాంబర్లో ప్రత్యేక పూజలు చేసి కలెక్టర్ భవేశ్ మిశ్రాను కుర్చీలో కుర్చోబెట్టి సర్వమత ప్రార్థనలు చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జీవిత కాలం మొత్తం తెలంగాణ గురించి తపించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ గారి పేరు మీద ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆచార్య జయశంకర్ సేవలు శాశ్వతంగా నిలిచిపోయేలా భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టామని గుర్తుచేశారు.
ఇతర రాష్ర్టాల్లో ఉన్న సచివాలయాలు, డీజీపీ కార్యాలయాల కంటే మెరుగ్గా మన జిల్లాల సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను నిర్మించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 2014కు ముందున్న తాగు, సాగునీరు, విద్యుత్ కోతల సమస్యలు నేడు లేవని, ప్రజలు వీటిని గ్రహించాలని మంత్రి కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలో రూ. 27కోట్లతో అత్యాధునిక పోలీస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గండ్ర, డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి కేటీఆర్ పోలీసుల చేత గౌరవం వందనం స్వీకరించారు.
చాంబర్లో ఎస్పీ పుల్లా కరుణాకర్‌ను కుర్చిలో కుర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డలో రూ.22.48 కోట్లతో నిర్మించిన 416 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. ఇండ్లను క్లుణ్ణంగా పరిశీలించారు. కాసీంపల్లికి చెందిన గంట లచ్చమ్మ, గుండేటి నీలాంబరం, భావనకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా గంట లచ్చమ్మతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘డబుల్ బెడ్ రూం ఇల్లు ఎట్లున్నది?.. నీకు ఎంత మంది పిల్లలు. పెన్షన్ వస్తున్నదా?’..అని అడిగారు.. ఆమె బదులిస్తూ ‘నాకు వచ్చిన డబుల్ బెడ్ రూం ఇల్లు మంచిగుంది సార్. నాకు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ.
ఇద్దరు కొడుకులు, బిడ్డ పెండ్లి చేసిన. కేసీఆర్ సార్ వచ్చినంకనే పింఛను వస్తాంది. ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చింది. చాన సంతోషంగా ఉంది సార్.’ అంటూ బదులిచ్చింది. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సహకారంతో జిల్లా గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ బుర్ర రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేటీకే 5 ఇైంక్లెన్ కమాన్ ఆవరణలో జాతీయ ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఎన్నికల్లో ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణను సాధించి ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ వైపు ఉందామా? 60 ఏండ్లు పాలించి మోసం చేసిన కాంగ్రెస్ వైపా ఆలోచించాలని కోరారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాలలో చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావును భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ఆయా నియోజవకర్గాల ప్రజలకు విజ్ఞప్తిచేశారు.