కాకతీయ తోరణం, చార్మినార్ లోగోలను తొలగిస్తామనడం తుగ్లక్ నిర్ణయమని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. చరిత్రపై అవగాహన లేని పాలకుడు రేవంత్‌రెడ్డి అని, ఆ పిచ్చి ఆలోచన మానుకోవాలన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్ లోగోను రాజము ద్ర నుంచి తొలగిస్తామంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌వాదులంతా లోగోను ఆమోదిస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ఆ పార్టీ నిర్ణయంగా భావించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోని వ్యక్తి.. చరిత్రను రూపుమాపాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సమైక్యవాదులకు రేవంత్‌రెడ్డి తొత్తుగా మారాడని, సరిహద్దులను మార్చేసి సమైక్యాంధ్రలో కలుపుతాడన్నారు. చరిత్ర గుర్తులను తొలగిస్తుంటే వరంగల్ జిల్లాలోని మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క వ్యతిరేకించపోవడం సిగ్గుచేటన్నారు. ఈ లోగో తీసేస్తే ప్రజల మదిలో నుంచి కేసీఆర్‌ను దూరం చేయొచ్చనే ఆలోచనతో ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తే చరిత్రను తీసేసిన ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ కళా తోరణాన్ని అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తే మరోసారి దశలవారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి నిర్ణయానికి నిరసనగా నేడు ఉదయం 11 గంటలకు కాళోజీ సెంటర్లో మానవహారం చేయనున్నట్లు తెలిపారు. కాకతీయ లోగో సృష్టికర్త అశోక్, సప్తతి రణధీర్, ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ రామ్మూర్తి, జాగృతి నాయకులు సుశీల్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, శ్రవణ్‌కుమార్, జనార్దన్, పుల్లా శ్రీనివాస్, షఫీ, కేయూ నాయకులు కొమురయ్య, జెట్టి రాజేందర్, పిన్నింటి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా, మే 30 : తెలంగాణ ప్రభుత్వం లోగోను మారుస్తుందనే అంశం పౌర సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కాకతీయ కళాతోరణం తొలగిస్తున్నారని వస్తున్న వార్త ఓరుగల్లు ప్రజలను కలవరానికి గురిచేస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు బాలసముద్రంలోని కాళోజీ సరిల్ వేదికగా శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టార్చ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ ఆర్య అన్నారు.
ప్రజల జీవన విధానం, సామాజిక బంధాలును నింపుకున్నది కళాతోరణం. అందులో ప్రజల ఆత్మ ఉంది. రాజుకు ప్రజలే నిజమైన సంపద అని అభయ శాసనం వేయించిన గణపతి దేవరాజు కాకతీయ తోరణాన్ని నిర్మించారు. ఇది కాకతీయ సప్త సంతాన తాత్వికతకు ప్రతీకగా నిలుస్తున్నది. ఎగుడు దిగుడు దకన్ పీఠభూమిలో నీటికి నడకను నేర్పి చెరువుల నిర్మాణం, తద్వారా రైతు సుభిక్షం దీనితో సమస్త కళా సంస్కృతులు వికాసం చెందాయని అనే అర్థం ఇమిడి ఉంది. కొత్త ప్రభుత్వం ప్రస్తుతం ఉనికిలో ఉన్న చిహ్నంలోని ఏ గుర్తును తొలగించవద్దు. ఇంకా ప్రజల జీవితాలను మెరుగుపరిచిన ఇతిహాసాన్ని తలపించే సమ్మక, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య పోరాటం, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలితాలను చేర్చాలి. రాజముద్ర నుంచి చిహ్నాలు తొలగించడం సరైంది కాదు. ఆత్మగౌరవానికి తేడా వస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఉన్నది తీసేస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతారు.
– అస్నాల శ్రీనివాస్, దొడ్డికొమురయ్య ఫౌండేషన్ చైర్మన్