మహబూబాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కేటీఆర్ సభతో బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయ న ప్రసంగం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మానుకోట జిల్లాపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సొం త జిల్లా లగచర్లలో గిరిజన ప్రజలపై ప్రభుత్వం చేసిన దాడిని ఖండిస్తూ మానుకోట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యా లయం ఎదుట ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతమయ్యింది.
శనివారం సర్పంచుల సన్మాన కార్యక్రమానికి యువనాయకుడు కేటీఆర్ వస్తాడని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు, పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫంక్షన్ హాల్ ప్రాంగణం నిండిపోవడంతో పాటు వేలాది మంది రోడ్లపైనే నిల్చున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన నూకల రాంచంద్రారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయ క్, మానుకోట ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్న సభకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చర్చ జరిగింది.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆశించినస్థాయిలో రాకపోడం గమనార్హం. ఇది ఆశించిన స్థాయిలో నిర్వహించలేకపోయారని జిల్లా నాయకత్వంపై సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈనెల 27న జిల్లా కేంద్రంలో ఒకే రోజున రెండు పార్టీలకు సంబంధించిన ప్రోగ్రాంలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం అధికారంలో ఉన్న పార్టీ మాదిరగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా స్థాయిలో పేలవంగా జరిగిందని జిల్లా ప్రజలు చర్చించుకోవడం కొసమెరుపు.