హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 17: బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు అమలు చేసేవరకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని శక్తిగా నిలబడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి హెచ్చరించారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యాపార, ఉద్యోగ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సమాజాన్ని అడ్డుకోవాలని చూస్తే మరో తెలంగాణ ఉద్యమంలా పోరాటం ఉండబోతుందన్నారు.
బీసీల కుల, జనగణన చేయమని .. 60 శాతం ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అడుగుతున్నామన్నారు. బీసీ సంఘాల నేతలు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను సైతం కలిసి మద్దతు కోరారని, పార్టీ మద్దతు ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంసల్లో బ్రూణహత్యలకు పాల్పడి రిజర్వేషన్ అడ్డుకుందని, శిశువును గర్భంలో ఉండగానే కుట్రలు చేసిందన్నారు. బీసీలంతా ఐక్యంగా 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. హేతుబద్ధమైన బీసీల డిమాండ్‌ను ఇతర వర్గాలు కూడా అర్థం చేసుకోవాలని, వారి అభ్యున్నతి కోసం గత సీఎం కేసీఆర్ వెయ్యి గురుకులాలు ప్రారంభించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దృష్టిలో బీసీలంటే రోబోలు అని, దశాబ్దాలుగా వారిపై జరుగుతున్న అణిచివేత కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో బీసీలంతా ఏకమై ముందుండి పోరాడారని, నేటి బంద్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీల ఆవేదన రేవంత్‌రెడ్డికి కనిపించడంలేదని, బడ్జెట్లో వాటా అడగడం తప్పా.. లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం రూ. రెండు, మూడు కోట్లు బిచ్చమేస్తున్నారని మండిపడ్డారు.
మేమెంతో మాకంత.. మా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జడ్పీ మాజీ చైర్మన్ సమ్మారావు మాట్లాడుతూ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలనే న్యాయనిబంధన కాంగ్రెస్ పార్టీకి తెలియదా?. కావాలనే బీసీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్‌సెల్ బాధ్యులు, నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపెల్లి జనార్దన్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన జీవో, ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లేదన్నారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ మాజీ చైర్మన్ సదానందం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి పున్నంచందర్, నార్లగిరి రమేశ్, శోభన్, రఘు, చాగంటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీని ఒప్పించి పార్లమెంటును స్తంభింపజేయాలి. 42 రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. బీసీలపై రేవంత్‌రెడ్డి డ్రామాలు బంద్ చేయాలి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి స్పీకర్‌గా మధుసూదనాచారిని, మండలి స్పీకర్‌గా స్వామిగౌడ్‌ని, ప్రభుత్వ చీఫ్ విప్‌గా నన్ను ఎంపిక చేసి కేసీఆర్ రాజకీయంగా బీసీ నేతలకు సముచిత స్థానం కల్పించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో గ్యారెంటీలు, హామీల పేరుతో గారడీ చేసింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో మోసం చేసింది.
రూ. 20 వేల కోట్లు నిధులు కేటాయిస్తారని అతీగతి లేదు. 42 శాతం రిజర్వేషన్లు అన్నారు. రిజర్వేషన్ల పేరుతో ఆర్డినెన్స్, జీవోలు, కోర్టులు, ఢిల్లీలో ధర్నాలు పేరుతో బీసీ సమాజాన్ని కాంగ్రెస్ మోసం చేసింది. బీసీలుగా స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతాం. ఓరుగల్లు వేదికగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. బంద్‌ను విజయవంతం చేయాలని సబ్బండ వర్గాలను కోరుతున్నాం. చట్టసభల్లో బీసీలకు రాజకీయ వాటా, అధికారం వచ్చే వరకు పోరాటం ఆగదు. ప్రధాని బీసీ అయినా ఇంగిత జ్ఞానం లేదని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీసీల 42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు ఉద్యమాన్ని ఆపలేరు. 42 శాతం రిజర్వేషన్ దక్కేవరకు పోరాడుతాం.