హనుమకొండ, మే 21 : బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను గురువారం ప్రకటించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు, నియోజకవర్గానికో ఐటీ నిపుణుడితో కలిపి తెలంగాణ భవన్లో సభ్యత్వాల నమోదుకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జిల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శిక్షణనిస్తారు. ఆ తర్వాత పండుగ వాతావరణంలో సభ్యత్వ పునరుద్ధరణ, నమోదు ప్రక్రి య మొదలవుతుందని, గ్రామస్థాయి నుంచి అన్ని రకాల కమిటీలకు షెడ్యూల్ ప్రకటించి, నిర్ణీత తేదీల్లో కమిటీల నియామకం పూర్తిచేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జనగామ నియోజకవర్గానికి బండా శ్రీనివాస్, ఘనపూర్‌కు నాగుర్ల వెంకన్న, పాలకుర్తికి ఎం సుధీర్‌కుమార్, డోర్నకల్‌కు మాజీ ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్‌కు వై సతీశ్‌రెడ్డి, నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరకాలకు సమ్మారావు, వరంగల్ పశ్చిమకు కే వాసుదేవరెడ్డి, వరంగల్ తూర్పునకు మర్రి యాదవరెడ్డి, వర్ధన్నపేటకు మసూద్, భూపాలపల్లికి రామస్వామినాయక్, ములుగుకు గండ్ర జ్యోతి, మంథనికి వీర్ల వెంకటేశ్వర్రావు, హుజూరాబాద్‌కు డాక్టర్ చిరుమిల్ల రాకేశ్, హుస్నాబాద్‌కు జీవీ రామకృష్ణారావు, ఇల్లందుకు చాడ కిషన్‌రెడ్డి, భద్రాచలానికి రావలపల్లి రామ్‌ప్రసాద్‌ను డిజిటల్ సభ్య త్వ నమోదు ఇన్చార్జిలుగా నియమించారు.