ములుగు, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న పర్యటనలతో ప్రజాధనం వృథా అవుతున్నదే తప్పా స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరడం లేదని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవనంలో ఆమె మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మూడు సార్లు దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పటికీ పనుల పురోగతి మాత్రం కానరావడం లేదన్నారు. కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తి కాగా, నీటిని పంపింగ్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ములుగు జిల్లాను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(నూగూరు), కన్నాయిగూడెం మండలాలనుమంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమెకు పంచాయతీరాజ్ శాఖ కన్నా పర్యాటక శాఖ కేటాయిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలపై సీతక్క కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, దానిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని కొత్తగూడెం, గంగారం మండలాలకు సాగునీటిని తరలించేందుకు పాకాలలో లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకులగూడెం బరాజ్ అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తుందన్నారు. సమ్మక్క బరాజ్ ద్వారా స్థానిక ప్రాంత ప్రజలకు తాగు నీటితో పాటు సాగు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన మేడారం మహా జాతరలో ఆధ్యాత్మికత దెబ్బతిన్నదని, జాతరలా కాకుండా కాంగ్రెస్ బహిరంగ సభలా జరిగిందని విమర్శించారు. ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయని, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా కట్టడాలను నిర్మించామని చెప్పిన ప్రభుత్వ మాటలు వెయ్యి రోజులు కాకముందే శిలలు విరిగిపోవడమే అవినీతికి నిదర్శనమని తెలిపారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, కుడుముల లక్ష్మీనారాయణ, లకావత్ నర్సింహానాయక్, కౌన్సిలర్లు కోయిల లక్ష్మి, గోనెల భరత్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బైకాని ఓదేలు, గొర్రె సమ్మయ్య, బైకాని సాగర్, ఆకుతోట చంద్రమౌళి, పోరిక విజయ్‌రామ్‌నాయక్, కాకి పురుషోత్తం, మాచర్ల ప్రభాకర్, అజ్మీరా చందూలాల్, చీదర సంతోశ్, కోగిల మహేశ్, అనుముల సురేశ్, గండి కుమార్, సీతారారామ్, గరిగె రఘు, అన్న తిరుపతి, లైశెట్టి రవిరామన్, ముంజాల భిక్షపతిగౌడ్, చల్లగురుగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.