కాశీబుగ్గ, ఫిబ్రవరి 25 : రైతుల గోస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాకుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డును మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, రైతు విమోచన మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్నతో కలిసి సందర్శించారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని వారికి మేమున్నామంటటూ ధైర్యం చెప్పారు.
అనంతరం ఎర్రబెల్లి మా ట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు బోగస్ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి ఆధికారంలోకి వచ్చాయని, రైతులను మోసం చేసిన ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని అన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి తొందర్లోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడం చాలా బాధాకరంగా ఉందని, వెంటనే ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాకు రూ. 25 వేలతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
గత సంవత్సరం కంటే క్వింటా మిర్చికి రూ.10 వేలు పడిపోవడంతో రైతులు అనేక అపసోపాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో పేజీ నంబర్ 9లో మిర్చి రైతులకు రూ.15 వేలకు తగ్గకుండా పంటను కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారని గుర్తు చేశారు. గతంలో మాదిరిగానే ప్రస్తుతం రైతులను కాంగ్రెస్ సర్కారు నట్టేట ముంచిందని అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ప్రత్యేక రివ్యూ నిర్వహిస్తుంటే మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం పాలనపై సోయిలేక రాజకీయాల కోసం ఎన్నికల్లో ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నాడని విమ ర్శించారు.
ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని, అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు రైతులకు మద్దతు ధరలు ఇచ్చేలా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, కార్పొరే టర్ దిడ్డి కుమారస్వామి, కుడా మాజీ డైరెక్టర్ మోడెం ప్రవీణ్, నాయకులు కేతిరి రాజశేఖర్, పత్రి సుభాష్, రాజపోశాలు, గండ్రాతి భాస్కర్, సిలువేరు వపన్, జక్కి యుగేంధర్, కొత్తపెల్లి యాదగిరి, నాతం హరీశ్, బానోత్ కిరణ్‌నాయక్, పసులాది మల్లయ్య పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు కల్పి స్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎగుమ తులకు 10 శాతం బోనస్ ఇవ్వాలి. రైతులను నిర్లక్ష్యం చేస్తే తొందర్లో బొంద పెడుతారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్రంతో మాట్లాడి క్వింటాకు రూ. 25 వేలకు తక్కువ కాకుండా కొను గోలు చేయాలి. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.
– గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మిర్చి పండించిన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలి. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత సంవత్సరం కంటే సగానికి సగం మిర్చి ధరలు పడిపోయాయి. నాణ్యతను బట్టి గిట్టుబాటు ధరలతో సర్కారే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మద్దతు ధర ఇవ్వకుండా రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రె స్ ప్రభుత్వాన్ని వారే గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. మిర్చి ధరలు పడిపోయి ఆందోళన చెందుతున్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పెట్టిన పెట్టుబడి రాక అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. కాం గ్రెస్ సర్కారు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నదని, తొందర్లోనే భూస్థాపితం చేస్తారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో, ఎరువులు సరఫరా చేయడంలో, బీమా కల్పించడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడే లేడు. స్థానిక జిల్లా మంత్రి కొండా సురేఖ మార్కెట్లో రైతులు పడుతున్న ఇబ్బందులు, వివిధ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే