మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 3 : వరదతో భారీగా నష్టపోయిన రావిరాల గ్రామాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. అక్కడి ప్రజలు తమ బాధలను సీఎం తీరుస్తాడని ఎదురు చూశారని, వారిని పరామర్శించకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి హడావిడిగా పర్యటించారని, ఇక్కడ అనేక చెరువులు తెగి పలు గ్రామాలు నీట మునిగాయని, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోక పోవటం వల్ల నష్టం జరిగిందన్నారు. అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించకపోవడం దారుణమన్నారు. ముంపునకు గురైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ఇంత వరకు ఎవరూ చేయలేదన్నారు.
ఆలేరు గ్రామంలో పెద్ద చెరువుకు గండి పడి 48 గంటలైనా ఒక్క అధికారి కూడా రాలేదన్నారు. యుద్ధ ప్రాతిపదికన పంట నష్టంపై సర్వే చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు వెళ్తే కొంత మంది కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. విపత్తు సమయంలో కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిదాడి చేస్తే ఆ పార్టీ నాయకులు ఒక్కరూ తిరగరని అన్నారు.
ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలను సర్వే చేయించి ఎకరాకు రూ. 30 వేలు పరిహారం అందించాలన్నారు. ఇల్లు ధ్వంసమైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇవ్వాలని, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి తగిన పరిహారం అందించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, బీఆర్ఎస్ నాయకులు లునావత్ అశోక్ నాయక్, గోగుల రాజు, దాము నాయక్, బాలు నాయక్, రామచంద్రు, వెంకటరెడ్డి, యాకన్న తదితరులు పాల్గొన్నారు.