హనుమకొండ, జూలై 4 : తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఘన నివాళులర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వారు సమావేశం నిర్వహించారు. ముందు గా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుదర్శన్‌రెడ్డి ఉద్యమ సమయంలో పార్టీని, వివిధ సంఘాలను ముందుకు నడిపిన విధానం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆయనకున్న ఆత్మీయ అనుబంధం, రాజకీయ, ప్రజలకందించిన సేవలను స్మరించుకున్నారు. పెద్ది మరణం పార్టీకి, ఉమ్మడి జిల్లాకు తీరని లోటని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని నేతలు పేర్కొన్నారు. పెద్ది సంస్మరణ సభ నిర్వహణకు సంబంధించి విస్తృతంగా చర్చించి, నాయకుల అభిప్రాయాలను సేకరించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వివరించారు. సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, రెడ్యానాయక్, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, మాజీ జడ్పీ చైర్మన్ మారపెల్లి సుధీర్‌కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకన్న, కే వాసుదేవరెడ్డి, సతీశ్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్, లింగంపల్లి కిషన్‌రావు, నాయకులు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, బండి రజిని తదితరులు పాల్గొన్నారు.