హనుమకొండ సబర్బన్, మార్చి 29 : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఎల్కతుర్తి మండలంకేంద్రం వేదిక కానున్నది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత కేసీఆర్ నిర్ణీత సభా స్థలానికి ఉమ్మడి జిల్లాకు గతంలో పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన గ్యాదరి బాలమల్లును శుక్రవారం పంపించి తుది పరిశీలన చేయించారు. ఆయనతో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవారెడ్డిలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
సభా వేదిక స్థలాన్ని గుర్తించి నాలుగు పార్కింగ్ స్థలాలను కూడా ఫైనల్ చేశారు. సభా స్థలంతో పాటు పార్కింగ్‌కు కూడా సుమారు 1000 ఎకరాల వరకు అనువుగా ఉన్న స్థలాలను గుర్తించి ఆయా స్థలాల రైతులతో నో ఆబ్జ్జెక్షన్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నారు. అలాగే సౌండ్ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్ల, లైట్ల బిగింపు కోసం సాంకేతిక నిపుణులు కూడా వచ్చి సర్వే చేసుకుంటున్నారు.
వరంగల్‌తో పాటు కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనాలేవీ ఎల్కతుర్తి జంక్షన్ వద్దకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సువిశాలమైన పార్కింగ్‌కు రూపకల్పన చేస్తున్నారు. కేవలం అర కిలోమీటర్ దూరంలోనే సభావేదిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల వెంట స్థానిక నాయకులు కరీంనగర్ డీసీసీబీ డైరెక్టర్ శ్రీపతి రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, పెరెడ్డి రవీందర్‌రెడ్డి, కడారి రాజు, మండల సురేందర్, తంగెడ నగేశ్, తంగెడ మహేందర్, గొల్లె మహేందర్, మునిగడప శేషగిరి, కోరె రాజ్‌కుమార్, గడ్డం రవి, చిట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.