స్టేషన్ ఘనపూర్ జూన్ 04 : స్టేషన్ ఘనపూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హులను ఎంపిక చేసిన అధికారులపై చర్యలు తీసుకొని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలంటూ బుధవారం స్థానిక స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన నిరుపేదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పైసలు ఇచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారని ఆరోపించారు.
మొదటి జాబితాలో అర్హులైన నిరుపేదలను ఎంపిక చేసి, తుది జాబితాలో అనర్హులను ఎంపిక చేశారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పార్టీ శ్రేణుల ప్రమేయం లేదని, అధికారులే విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనడం విడ్డూర మన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అయితే మండలంలో మరోసారి విచారణ చేపట్టి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మునిగల రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మారపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు పెసరు సారయ్య, పార్షి రంగారావు, బంగ్లా శ్రీనివాస్, కలకోల సమ్మయ్య, నక్క ప్రవీణ్, గోవింద్ అశోక్, వీరా సింగ్ తదితరులు పాల్గొన్నారు.