తొర్రూరు, ఫిబ్రవరి 17 : అధికార అహం ముందు ప్రజాస్వామ్యం తలవంచింది. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు పరిహాసమైంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికార బలం.. అరాచకం తో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నది. మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌కు 8 ఓట్లు ఉండగా, నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కే చైర్మన్ పీఠం దకాలి. కానీ, ఇక్కడే అధికార పార్టీ అడ్డదారులు తొక్కింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఇంతకుముందే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓటు నమోదు చేసుకున్నారు. మళ్లీ ఆమెకు తొర్రూరులో కూడా ఓటు హకు కల్పించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనేనని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో 3వ వార్డు కౌన్సిలర్ తూర్పాటి రవి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు 9మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఎంపీ కడియం కావ్యతో సహా 7 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో బీఆర్ఎస్కు 9 కౌన్సిలర్ ఓట్లు నమోదు కాగా, కాంగ్రెస్‌కు 7, రెండు ఎక్స్అఫీషియోతో 9 ఓట్లు నమోదయ్యాయి. రెండు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో అధికారులు డ్రా పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తునం శ్రావణ్ చైర్మన్‌గా, సోమ రజినీ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
స్పష్టమైన ప్రజాభిప్రాయం బీఆర్ఎస్కు ఉన్నా, చెల్లని ఎక్స్అఫీషియో ఓటును అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ పదవిని దక్కించుకున్నదని స్థానికులు విమర్శిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తొర్రూరు పట్టణాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. ఉదయం 5 గంటల నుంచే సుమారు వెయ్యి మంది పోలీసులు, మూడు జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో భారీ కవాతు నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల బస్సు, మాజీ మంత్రి ఎర్రబెల్లిని పర్వతగిరి నుంచి తొర్రూరుకు రాకుండా పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ క్రమంలో తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎర్రబెలి దయాకర్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి నర్సింహులపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఎర్రబెల్లికి మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. విషయం తెలుసున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎర్రబెల్లికి సంఘీభావం ప్రకటించారు.
తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్యకు ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఓటు నమోదు చేయడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపల్ గేటు ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలుత కావ్య ఎక్స్అఫీషియో మెంబర్‌గా ఓటు నమోదుకు దరఖాస్తు చేయగా, నిబంధనల ప్రకారం సాధ్యం కాదని అధికారులు తిరస్కరించినట్లు తెలిపారు. అయితే, తిరిగి దరఖాస్తు చేయకపోయినా అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఓటు నమోదు చేసినట్లు ఆరోపించారు.
వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కావ్య, ఏడాది తర్వాత మరో మున్సిపాలిటీలో ఎలా ఓటు నమోదు చేసుకుందో అధికారులు స్పష్టం చేయాలన్నారు. ఒకసారి తిరసరించిన తర్వాత మళ్లీ దరఖాస్తు లేకుండానే ఓటు నమోదు చేయడం చట్ట విరుద్ధమన్నారు. అధికారులు కాంగ్రెస్ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలో న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భూసాని జయమ్మ, తూర్పాటి రవి, జంపన్న, మాడుగుల భవానీలత, శ్యా మల, కిన్నెర కవిత, కర్నె నాగరాజు, ధరావత్ పద్మ, అలివేణి పాల్గొన్నారు.
కురవి, ఫిబ్రవరి 17 : తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను నిర్బంధించడమే పనిగా పెట్టుకున్నది. తొర్రూరుకు వెళ్లకుండా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌ను ముందస్తుగానే మహబూబాబాద్‌లోని తన ఇంట్లో హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల అనుమతితో కురవిలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అదే సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు నర్సింహులపేట పోలీసుస్టేషన్లో ఉంచారని తెలుసుకొని ఆయనను కలిసేందుకు జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసేందుకు వెళ్తుండగా ఆమెను మాధవాపురం దాటగానే మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి అడ్డుకున్నారు. తాను తొర్రూరు వెళ్లడంలేదని చెప్పినా వినకుండా, నర్సింహులపేటకు వెళ్లకుండా ఎస్కార్ట్‌గా మాజీ మంత్రిని మహబూబాబాద్‌లోని ఇంటి వద్దకు తీసుకువెళ్లారు.