హనుమకొండ, ఆగస్టు 23 : ఉద్యోగుల సమస్యలపై పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆయన ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలో 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు కేంద్రంగా ప్రారంభమైన ఏ ఉద్యమం ఓడిపోలేదని, విశ్రాంత, ఉద్యోగులు, నిరుద్యోగుల ఉద్యమం కూడా ఓడిపోదన్నారు. కాంగ్రెస్ మెడలు వంచైనా నూతన పీఆర్సీ, పెండింగ్ బకాయిలు విడుదల చేయిస్తామని తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, జీవో 97ను తక్షణమే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ గ్రాట్యుటీ, పెన్షన్, ఇతర బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించాలని, ఆశ, అంగన్వాడీ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, హోంగార్డులు, లైసెన్స్ సర్వేయర్లు, 104, 108 సిబ్బంది సమస్యలు పరిషరించాలన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, అందాల పోటీలు, పుట్‌బాల్ మ్యాచ్‌లకు రూ. వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగుల జీతాల నుంచి ఈహెచ్ఎస్ పేరుతో కోతలు విధిస్తున్నప్పుడు వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు రేవంత్‌రెడ్డి చిట్టా విప్పుతా అంటుందని, అవేంటో త్వరగా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి పంపకాల గొడవలు, ఫ్యామిలీ, పదవుల గొడవలు తప్ప ప్రజల గోడు పట్టించుకొనే వాడు లేడని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి తన సోదరులకు దోచిపెట్టడానికి, ఢిల్లీకి మూటలు మోయడంలో ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేసిన ఉద్యో గులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమంపై లేదని ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారన్నారు. గత 30 ఏళ్లలో 2014 కంటే ముందు 110 శాతం పీఆర్సీ ఇస్తే తొమ్మిదేండ్లలో రెండు పీఆర్సీలు కలుపుకొని 78 శాతం ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్స్‌లు పెంచుకొనేందుకు నిధులుంటాయి, కానీ పీఆర్సీ, డీఏలు ఇచ్చేందుకు లేవా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల హకుల కోసం చేపట్టిన 2కే రన్‌ను అవసరమైతే కేటీఆర్ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంగా విస్తరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు రామస్వామి, సదానందం తదితరులు పాల్గొన్నారు.