Bade Nagajyothi | ఏటూరు నాగారం : గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని పోలీసులు అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. చల్వాయి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి ఏటూరునాగారంలోని పార్టీ నాయకుడు తాడూరి రఘు ఇంటికి వచ్చారు. పోలీసులు అక్కడికి కూడా రావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బడే నాగజ్యోతి అంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ తీస్తూ నినాదాలు చేస్తూ బస్టాండ్ చేరుకున్నారు. బస్టాండ్ సెంటర్లో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు.
చుక్కా రమేష్ మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్క రమేష్ ఇంటికి వెళ్లి బెదిరించిన కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులకు ఇల్లు రాలేదని సోషల్ మీడియాలో ప్రశ్నించడం ఈ ప్రజాస్వామ్యంలో తప్పా అంటూ ఆమె ప్రశ్నించారు. బెదిరింపులకు భయపడి రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేకుంటే హత్య జరిగిందా..? అనేది కూడా తెలియకుండా ఉందని పేర్కొన్నారు. రాస్తారోకో అనంతరం పోలీసులు నాగజ్యోతితో పాటు ఆ పార్టీ నాయకులు గడదాసు సునీల్ కుమార్, తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, ఖాజా పాషా, దన్నపునేని కిరణ్, తూరం పద్మ, కాళ్ళ రామకృష్ణ, మెరుగు వెంకటేశ్వర్లు, కట్కూరి కిరణ్, బాస శరత్, భాసాని శేఖర్, దీపాక శ్రీరామ్, సప్పిడి వెంకట్రాం, నరసయ్య, వావిలాల ముత్తయ్య, వావిలాల కిషోర్, చందా లక్ష్మీనారాయణ, పాలకుర్తి శ్రీనివాస్, నూతి రమేష్, జాడి భోజరావు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.