జయశంకర్ భూపాలపల్లి, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సింగరేణి పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ప్రభుత్వ పాత్ర, గుర్తింపు సంఘాల వైఫల్యాలను కార్మికులకు వివరించేందుకు ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ పేరుతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిరక్షణ సదస్సులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరగనున్న సదస్సుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితోపాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, సంఘం రాష్ట్ర ప్రతినిధులు హాజరుకానున్నారు.
సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సదస్సుకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్‌లో రూ. 1600 కోట్ల విలువ చేసే 40 లక్షల టన్నుల బొగ్గు స్కాం, సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో కోరుకున్న వారికి బొగ్గు బ్లాకులను కట్టబెట్టే కుతంత్రాలు, నైనీ కోల్స్కాంను బీఆర్ఎస్ బయటపెట్టగానే ఆగమేఘాలపై డిప్యూటీ సీఎం టెండర్లు రద్దు చేయడం, సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 54 వేల కోట్ల బకాయిలు, సింగరేణిలో మెడికల్ బోర్డును పక్కన పెట్టడం, గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరుతో కార్మికులను ఇంటికి పంపే ప్రయత్నాలు, 12వ వేతన సవరణ ఒప్పందం, కార్మికులకు సొంతింటి పథకం అమలు తదితర అంశాలపై సదస్సులో హరీశ్‌రావు కార్మికులకు వివరించి ప్రభుత్వ, కార్మిక సంఘాల, సింగరేణి యాజమాన్య పనితీరును ఎండగట్టనున్నారు.
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగే సింగరేణి పరిరక్షణ సదస్సుకు కార్మికులు కదం తొక్కాలి. అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేయడమే కాకుండా సింగరేణిలో సైతం హామీలిచ్చి కార్మికులను మోసం చేసింది. 30 నెలల ప్రభుత్వ పాలన, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల పాలన అవినీతిమయమైంది. కార్మికులకు కొత్తగా ఏ ఒక్కటీ సాధించకపోగా ఉన్న హక్కులను కాలరాశారు. అటు ప్రజలు, ఇటు గని కార్మికులు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. సింగరేణిలో పరిస్థితులపై మాజీ మంత్రి హరీశ్‌రావు కార్మికులకు వివరిస్తారు.
– గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలతో సింగరేణి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉంది. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కార్మిక వర్గం ప్రశ్నించాలి. కాంగ్రెస్ సర్కారు తమ అనుకూల వ్యక్తులకు టెండర్లు కట్టబెట్టేందుకు సైట్ విజిట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కుట్రలను ఎండగట్టాలి. ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్న పరిరక్షణ సదస్సుకు కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలి
– మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు