ఆత్మీయ సమ్మేళనాల కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ పలకరింపుతో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నేరుగా కలిసి బొట్టు పెడుతున్నారు. ఆహ్వాన పత్రికలు, పార్టీ కండువాలు అందజేసి ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యే నన్నపునేని డివిజన్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల ఉద్దేశాన్ని కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, ముఖ్య కార్యకర్తలకు వివరిస్తున్నారు. గ్రేటర్ 35వ డివిజన్లో ఈనెల 26వ తేదీన 2 వేల మందితో తొలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరంగల్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : ఆత్మీయ సమ్మేళనాలను పురస్కరించుకొని వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మీయ పలకరింపుతో ముందుకు వెళ్తున్నాయి. తమ పార్టీ కార్యకర్తలను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నేరుగా కలిసి బొట్టు పెడుతున్నారు. ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కండువాలను కూడా వారికి అందజేస్తున్నారు. అనంతరం డివిజన్ల వారీగా ఎమ్మెల్యే నరేందర్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర నియోజకవర్గాల కంటే భిన్నంగా తూర్పులో ఈ కార్యక్రమాలు జరుగుతుండడం విశేషం. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు మరింత చేరువ కావడానికి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. మే నెలాఖరులోగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు జరుపాలని పిలుపు ఇచ్చింది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జిలను నియమించింది. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతోనూ మాట్లాడి సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి ఆయా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వివిధ గ్రామాలు, వార్డులతో కూడిన క్లస్టర్, మరికొన్ని నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు ఎంపీటీసీ స్థానాల పరిధిలోని గ్రామాలు, ఇంకొన్ని నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల స్థాయి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారు. వీటికి ఆయా గ్రామం, వార్డులోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు హాజరవుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలేమైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనాల్లో ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో లబ్ధిదారులు తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, సబ్సిడీపై గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల సరఫరా, దళితబంధు వంటి పథకాల ద్వారా తాము పొందిన ప్రయోజనాలను ఆత్మీయ సమ్మేళనాల్లో వివరిస్తున్నారు. ఇవి ముగిసిన తర్వాత ఈ సమ్మేళనాల్లో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు ప్రస్తావించిన అంశాలపై వాడవాడన చర్చ జరుగుతుంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలకు హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులకు నేరుగా ఆహ్వానం అందుతోంది. ఈ నియోజకవర్గంలో మే నెలాఖరులోగా డివిజన్ల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ కోసం స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ షెడ్యూల్ రూపొందించారు. ఈ నెల 26 నుంచి తూర్పు నియోజకవర్గం పరిధిలో డివిజన్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయయని ఆయన ప్రకటించారు. 35వ డివిజన్లో రెండు వేల మందితో 26న తొలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతారని నరేందర్ తెలిపారు. ఆయన సూచనలతో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు తమ డివిజన్ పరిధిలో బొట్టు కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల శ్రేణులతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలిసి బొట్టు పెట్టారు. ఆరు రోజుల పాటు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ పరిధిలో ఈ బొట్టు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆ తర్వాత ఈ నెల 18వ తేదీ నుంచి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డివిజన్ల వారీగా కార్పొరేటర్, బీఆర్ఎస్ నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల ఉద్దేశాన్ని ఎమ్మెల్యే నరేందర్ సన్నాహక సమావేశాల్లో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, ముఖ్య కార్యకర్తలకు వివరిస్తున్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. నిఖార్సుగా పార్టీ కోసం నిలబడదాం, మరిన్ని విజయాలు సాధిద్దామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు గొప్ప పాలన అందిస్తోందని, కార్యకర్తలు పట్టుదలతో పనిచేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే నరేందర్ పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇతర డివిజన్లలో కార్పొరేటర్, బీఆర్ఎస్ నేతలు, ము ఖ్య కా ర్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక స మావేశాల నిర్వహణకు నన్నపునేని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న వాడవాడన బీఆర్ఎస్ జెండా పండుగ జరుగనుంది. ఇందుకోసం జెండా గద్దెలను రంగులతో తీర్చిదిద్దుతున్నారు.