నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 9 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29 నుంచి 11 రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందులో భాగంగా మంగళవారం విజయ్ దివస్‌ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయ డంతో పాటు అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హాజరై తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, స్వరాష్ట్ర సాధన పోరాటంపై మాట్లాడారు. పర్వతగిరిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉద్యమ చారిత్రక ఘట్టాన్ని స్మరిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఖిలా వరంగల్ పడమర కోటలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పాల్గొని అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. భూపాలపల్లి మండలం గొర్లవీడులో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, గోవిందరావుపేటలో రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్ రెడ్డి పాల్గొని జై తెలంగాణ నినాదాలు చేశారు.
