Gruhalakshmi Scheme | నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ఓ వైపు కొనసాగిస్తూనే.. మరో వైపు సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనే వారికి శుభవార్త చెప్పింది. ఇందుకోసం ‘గృహలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టి, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇళ్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించగా, జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు కలిపి 6వేల ఇళ్లతో పాటు మండలాలకు అదనంగా మరిన్ని మంజూరు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో తమకు ఎంతో ఊరట లభించనున్నదని నిరుపేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ఒకవైపు కొనసాగిస్తూనే.. మరో వైపు సొంత స్థలం ఉంచి ఇళ్లు నిర్మించుకోవాలనే వారికి సర్కారు శుభవార్త చెప్పింది. ఇందుకోసం ‘గృహలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకోవాలనే వారికి ఒక్కో ఇంటికి రూ.3లక్షలు అందించనున్నది.
ఈ సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇళ్లను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు కలిపి 6వేల ఇళ్లతో పాటు తొర్రూరు, పెద్దవంగర, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం మండలాలకు అదనంగా మరిన్ని రానున్నాయి. ఫలితంగా నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఊరట లభించనున్నది. ఈ ఇండ్లు మొత్తం వందశాతం సబ్సిడీపై రూ.3లక్షలు మంజూరు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా లబ్ధిదారు పేరున తీయాల్సి ఉంటుంది. బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాక రూ.లక్ష, నిర్మాణం మొత్తం పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష ఇస్తారు. కొత్తగా మంజూరు చేసే ఇళ్లు మొత్తం మహిళల పేరు మీదనే మంజూరు చేస్తారు. లబ్ధిదారులు సొంత డిజైన్ ప్రకారం ఇళ్లు నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి పథకం లోగోను ఇంటిపై వేస్తారు. లబ్ధిదారుడు కచ్చితంగా ఆహార భద్రత కార్డుతో పాటు సొంత జాగ కలిగి ఉండాలి. స్థానికుడై, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలు, మైనార్టీలకు 50శాతానికి తగ్గకుండా ప్రాధాన్యమివ్వాలి. దరఖాస్తుదారు, లేక అతడి కుటుంబ సభ్యులు లబ్ధిపొంది ఉంటే పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు.
సొంత జాగ ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి రూ.3లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషంగా ఉన్నది. సర్కారు నిర్ణయంతో ఎంతో మంది పేదలకు న్యాయం జరగుతుంది. గృహలక్ష్మి పథకం పూర్తిగా మహిళల పేరుపై ఇవ్వడం చాలా బాగుంది. సీఎం కేసీఆర్ సార్ ఎంతో మంది నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడం ఆనందంగా ఉన్నది. – రచ్చ అనిల్, కురవి