జనగామ గడ్డ నుంచి ఈ నెల 16న ఉమ్మడి జిల్లా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జననేత.. బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ నేడు మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు విచ్చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు మానుకోట శివారులోని శనిగపురంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించే మహబూబాబాద్ నియోజకవర్గ సభ, మధ్యాహ్నం 3గంటలకు నగర శివారులోని భట్టుపల్లిలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించే వర్ధన్నపేట నియోజకవర్గ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఈ మేరకు ఆయాచోట్ల హెలిప్యాడ్, సభావేదికల ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ కవిత పరిశీలించారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతతో పాటు వసతులు కల్పించారు. కాగా భారీ హోర్డింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలతో రెండు నియోజకవర్గాలు గులాబీమయమయ్యాయి.
మడికొండ, అక్టోబర్ 26 : గ్యారెంటీ, వారెం టీ లేని పథకాలతో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులను సైతం తెలంగాణ సంక్షేమ పథకాలు కావాలని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమంతా కోరుకుంటున్నదన్నారు. భట్టుపల్లిలో నేడు జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంలో గురువారం ఆయన బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షు డు అరూరితో కలిసి విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలలను సా కారం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు కోరుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను సభలో కేసీఆర్ వివరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా సభకు శ్రేణులను తరలించనున్నట్లు తెలిపారు. అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కాం గ్రెస్ పార్టీ ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేస్తుందని ప్రశ్నించారు. 24గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తుంటే మూడు గంటలే సరిపోతుందని చెప్పిన రేవంత్‌రెడ్డి.. గతంలో కాంగ్రెస్ 9గంటలు ఇస్తామని చెప్పి మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తే రైతులు పంటలు పండక విలవిలలాడారని గుర్తు చేశారు.
రైతుబంధును నిలిపివేయాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం దుర్గార్గమైన చర్యగా అభివర్ణించారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పిస్తే నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీని అందించారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఇంటి బిడ్డగా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నానని చెప్పారు. అన్ని నియోజకవర్గాలకు దీటుగా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రూ.400 కోట్లతో విలీన గ్రామాలను బాగుచేశామని, ఆకేరు వాగుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. నియోజకవర్గ విస్తీర్ణం ఎకువగా ఉండడం వల్ల ప్రతి మండలంలో క్యాంప్ కార్యాలయాలు ఏర్పా టు చేసి సహాయకుడి ద్వారా ప్రజా అవసరాలను తెలుసుకొని సమస్యలను పరిషరిస్తున్నట్లు తెలిపారు. మూడోసారి కూడా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రజా ఆశీర్వాద సభకు మహిళలు గడపగడప నుంచి తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితా యాదవ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, నాయకులు జయపాల్‌రెడ్డి, నార్లగిరి రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి, కర్ర హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.