వరంగల్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కాశీబుగ్గ/ కేసముద్రం: పత్తి కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ మాయాజాలాన్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు అండగా నిలిచింది. వానకాలం మొదలైన ప్పటి నుంచి పండించిన పంట మార్కెట్‌కు చేరేదాకా రైతులు పడిన అవస్థను బీఆర్ఎస్ లోకానికి చాటింది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను మరోసారి తూర్పారబట్టింది. కాలం వేసిన కాటు.. రేవంత్ సర్కార్ చేసిన చేటుకు విలవిలలాడుతున్న రైతుకు అన్ని విధాలా అండగా ఉంటామని బీఆర్ఎస్ బాస చేసింది.
కపాస్ కిసాన్ యాప్, ఎల్1, ఎల్2, ఎల్3 వంటి నిబంధనలే కాకుండా ఈసారి కొత్తగా తేమశాతంపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం జమిలీగా పత్తి రైతును శాపగ్రస్థం చేయాలని పన్నిన కుట్రను బీఆర్ఎస్ పసిగట్టింది. సీసీఐ భుజం మీద తుపాకీ పెట్టి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని శాశ్వతంగా ఎత్తివేసే చర్యల్లో భాగంగా రైతును నిండా ముంచాలని వేసిన ఎత్తుగడను బీఆర్ఎస్ చిత్తుచేసింది. విభజించి..పాలించు అన్న సూత్రాన్ని పాటి స్తూ సర్కార్ జిన్నింగ్ మిల్లులను చీల్చాలని, వారి ఐక్యతను దెబ్బకొట్టడం ద్వారా రైతులకు అన్యా యం చేయాలనే సర్కార్ వ్యూహాన్ని బీఆర్ఎస్ భగ్నం చేసింది. రైతుకు అన్యాయం చేస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించింది.
రేవంత్‌రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలతో తాము ఇబ్బందుల పాలవుతున్నామని, ప్రభుత్వ తీరును నిరసి స్తూ తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లుల వెల్ఫేర్ అ సోసియేషన్ సర్కార్‌కు అల్టిమేటమ్ జారీ చేసింది. అమ్మ పెట్టదు..అడుక్కోనివ్వదు అన్నట్టు సీసీఐ కొనదు..ముందుకొచ్చి కొనుగోలు చేసే వ్యాపారులను ఇబ్బందులపాలు చేస్తుందని, ఈ నేపథ్యంలో తామేం కావాలని గుబులు చెందిన రైతన్నకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో శాసన మండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, గండ్ర వెంకటర మణారెడ్డి, డాక్టర్ టీ. రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, రాష్ట్ర కార్పొరే షన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నేతలు రాకేశ్‌రెడ్డి, టీ. రమేశ్‌బాబు, చింతం సదానందం, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు మంగళవారం మార్కెట్బాట పట్టారు. ఏనుమాముల, కేస ముద్రం వ్యవసాయ మార్కెట్లను పరిశీలించారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వచ్చిన రైతులతో మాట్లాడారు. పరకాల నియోజకవర్గంలోని మొగిలిచర్ల గ్రామంలో రైతులతో మాట్లాడారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ మార్కెట్‌ను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. పరిస్థితిని తీవ్రతను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హుటాహుటిన జిన్నింగ్ మిల్లుల యజమానులతో మంతనాలు ప్రారంభించింది. ప్రభుత్వం తమతో జరిపిన చర్చల ఫలితంగా తాము బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగిస్తామని వెల్లడించింది. తాము చేపట్టిన మార్కెట్బాట సూపర్‌హిట్ అయిందని, తమ దెబ్బకు సర్కార్ దిగొచ్చి రైతులకు మేలు జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా రైతులోకం గులాబీ దండుకు కృతజ్ఞతలు చెప్పటం గమనార్హం.

కేసముద్రం మార్కెట్లో రైతులతో ముచ్చట..
ఆ తర్వాత కేసముద్రం వ్యవసాయ మారెట్ను సందర్శించి, మారెట్‌కు వడ్లు, మకజొన్నలు అమ్మ డానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. యూరియా బస్తాలు దొరకక నానా ఇబ్బందులు పడ్డామని, యాసంగికి బోనస్ ఇవ్వలేదని ప్రైవేట్‌లో అమ్ముకున్నామని అన్నదాతలు తమ గోసను వివరించారు. మకలు మార్ఫెడ్కు అమ్మి 15 రోజులు అవుతున్నా డబ్బులు పడలేదని మరో రైతు వాపోయాడు.
ఉద్యమకారుడి కుటుంబానికి పరామర్శ
కురవి మండలంలోని రాజోలు గ్రామంలో మలిదశ ఉద్యమకారుడు, జగన్ ఓదార్పుయాత్ర మాను కోట రాళ్లదాడిలో బులెట్లకు ఎదురెల్లిన ఉద్యమవీరుడు తోట రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న హరీశ్‌రావు వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయ న కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అధైర్యపడవద్దని సూచించారు. అదేవిధంగా ఇను గుర్తి మండల కేంద్రంలోని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, వద్దిరాజు కిషన్ తల్లిదండ్రులు వద్దిరాజు నారాయణవెంకటనర్సమ్మ స్మృతివనంలో వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రైతు బంధు వస్తలేదు.. రుణమాఫీ కాలేదు
హరీశ్‌రావు : ఏం పేరు, ఏ ఊరు?
రైతు : బోడ వాల్య, బేరువాడ గ్రామం సార్
హరీశ్ : మార్కెట్‌కు ఏం తీసుకొచ్చావు, రేటు ఎట్ల పడింది?
రైతు : ధాన్యం తీసుకొచ్చిన. క్వింటాకు రూ.2311 పడింది
హరీశ్ : ప్రభుత్వానికి ఎందుకు అమ్మడం లేదు?
రైతు : బోనస్ ఇస్తదో ఇయ్యదో అని. డబ్బులు వెంటనే పడడం లేదు.
హరీశ్ : క్వింటాకు రూ.600 నష్టపోతున్నావు కదా?
రైతు : ఏం చేద్దాం సార్ పెట్టుబడికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మక్కజొన్న వేయాలి.
హరీశ్ : రైతు బంధు రావడం లేదా?
రైతు : రావడం లేదు
హరీశ్ : బ్యాంక్‌లో ఎంత అప్పు తీసుకున్నావు?
రైతు : రూ. లక్ష తీసుకున్న. రుణ మాఫీ కాలేదు సార్
బోనస్ ఇస్తలేరు.. అందుకే ప్రైవేట్ల అమ్ముకున్న
హరీశ్‌రావు : ఏం పేరు
రైతు రాంకోటి : భూక్యా రాంకోటి
హరీశ్‌రావు : ఏ ఊరు నీది?
రైతు : గొట్లకొడం. అప్పుడు
మా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
హరీశ్ : కేసముద్రం మార్కెట్‌కు ఎందుకు వచ్చావు?
రైతు : వడ్లు అమ్మడానికి వచ్చిన
హరీశ్ : మార్కెట్లో ఎందుకు అమ్ముతున్నావు. ప్రభుత్వం కొనడం లేదా..
రైతు : బోనస్ ఇస్తలేదు. డబ్బులు తొందరగా పడుతలేవు
హరీశ్ : సర్కారు మీద నమ్మకం లేదా..
రైతు : మంత్రులు, ముఖ్యమంత్రి తలో మాట చెబుతున్నారు. వారి మీద నమ్మకం లేకుండాపోయింది.
హరీశ్ : దిగుబడి ఎలా ఉంది?
రైతు : టైముకు యూరియా లేక దిగుబడితగ్గింది. రోజుల తరబడి లైన్లో నిలబడినా దొరకలేదు
హరీశ్ : యూరియా లేకపోతే ఏం చేసినవు?
రైతు : మూడు 17 రకం బస్తాలు వేశాను
హరీశ్ : ఎంతకు కొన్నావు,.
రైతు : ఒక్కొక్కటి రూ.1500లకు కొన్న.
హరీశ్ : రేవంత్రెడ్ఢి రూ. 300 యూరియా ఇవ్వకపోతే రూ.1500 పెట్టి మూడు బస్తాలు కొన్నావా?
రైతు : అవును సార్. పెట్టుబడి ఎక్కువైంది. దిగుబడి తగ్గింది. రైతు బంధు రాలేదు.
హరీశ్ : కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండె?
రైతు : ఆటో పంపిస్తే యూరియా వచ్చేది